మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులను అనుసంధానం చేయాలని భావిస్తోంది. విజయ బ్యాంక్, దేనా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులను విలీనం చేసే యోచన ఉందని ప్రభుత్వం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులను అనుసంధానం చేయాలని భావిస్తోంది. విజయ బ్యాంక్, దేనా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులను విలీనం చేసే యోచన ఉందని ప్రభుత్వం తెలిపింది. ఈ మూడు బ్యాంకులను ఒకటి చేసి.. దేశంలోనే అతి పెద్ద బ్యాంకుగా తీర్చిదిద్దాలన్నదే తమ ఉద్దేశమని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని కార్యదర్శి తెలిపారు. ఈ మూడు బ్యాంకు బోర్డులు కూర్చొని మాట్లాడుకొని.. విలీన ప్రక్రియ ఎలా చేయాలనే విషయంలో ఒక నిర్ణయానికి వస్తాయని ఆయన తెలిపారు.
ఇదే అంశంపై ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ కూడా స్పందించారు. తమ ప్రభుత్వం బ్యాంకులను అనుసంధానించే ప్రక్రియ గురించి బడ్జెట్ సమావేశాలప్పుడే తెలిపిందని.. ఆ ప్రక్రియలో భాగంగా తాము వేస్తున్న తొలి అడుగు ఇదేనని ఆయన అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎస్బీఐ అసోసియేట్ బ్యాంకులను విలీనం చేశాక.. ప్రభుత్వం తీసుకుంటున్న మరో సాహసోపేత నిర్ణయం ఇదేనని పలువురు ఆర్థిక నిపుణులు అంటున్నారు.
దేనా బ్యాంకుని 1938లో దేవకరణ్ నాన్జీ అనే వ్యక్తి స్థాపించారు. 1969లో ఈ బ్యాంకును భారత ప్రభుత్వం జాతీయం చేసింది. బ్యాంకు ఆఫ్ బరోడాని 1908లో మహారాజా సాయాజీరావ్ గైక్వాడ్ స్థాపించారు. 1969లో ఇదే బ్యాంకును భారత ప్రభుత్వం పీఎస్‌యూగా మార్చింది. ఇక విజయ బ్యాంకును 1931లో కర్ణాటకలో ఏ.బి.శెట్టి ప్రారంభించారు. ఈ బ్యాంకును కూడా 1958లో భారత ప్రభుత్వం షెడ్యూల్ బ్యాంకుగా మార్చింది. 1980లో ఈ బ్యాంకు కూడా జాతీయం చేయబడింది.