స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) పరీక్షా పేపర్ల లీకేజ్‌ అంశంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ తెలిపారు. 'నిరసనకారుల డిమాండ్‌ను మేము అంగీకరిస్తున్నాం. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాం. అభ్యర్థులు తమ ఆందోళనలను విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నా' అని ఆయన అన్నారు. గతనెల ఫిబ్రవరి 17 నుంచి 22 వరకు ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌(టైర్‌-2) పరీక్షలను నిర్వహించారు. కానీ 21వ తేదీ జరగాల్సిన పరీక్షను వాయిదా వేశారు. పేపర్‌ లీక్‌ కావడంతోనే పరీక్ష వాయిదా వేసినట్లు వార్తలు వచ్చాయి.


దీంతో ఎస్‌ఎస్‌సీ అభ్యర్థులు ఢిల్లీలో గత వారం రోజుల నుండి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ వివాదంపై ఢిల్లీ భాజపా ఎంపీ మనోజ్‌ తివారీ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో మాట్లాడారు. ఎస్‌ఎస్‌సీ పేపర్‌ లీకేజ్‌పై సీబీఐ విచారణ చేపట్టాల్సిందిగా కాంగ్రెస్‌ పార్టీ నేతలతో పాటు అభ్యర్థులు కూడా డిమాండ్‌ చేశారు. సీబీఐతో దర్యాప్తు చేయించేందుకు ఎస్‌ఎస్‌సీ కూడా సరేనంది. దాంతో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు.