జీపీఎఫ్ వడ్డీ రేటును పెంచిన కేంద్ర ప్రభుత్వం
జీపీఎఫ్ వడ్డీ రేటును పెంచిన కేంద్ర ప్రభుత్వం
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్), ఇతర పథకాలపై వడ్డీ రేటును పెంచుతూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం అక్టోబర్-డిసెంబరు త్రైమాసికానికి వడ్డీరేటును 8 శాతానికి పెంచింది. పెంచిన వడ్డీ రేటు ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి వర్తిస్తాయి.
జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి జీపీఎఫ్, ఇతర పథకాలపై వడ్డీ రేటు 7.6 శాతం ఉండేది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇప్పుడు వడ్డీరేటు 8 శాతానికి పెరిగింది.
2018-2019 సంవత్సరంలో, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ మరియు ఇతర పథకాల చందాదారులకు అక్టోబర్ 1, 2018 నుండి డిసెంబరు 31, 2018 వరకు 8 శాతం వడ్డీని చెల్లించనున్నట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ తెలిపింది.
పెంచిన వడ్డీ రేటు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే, రక్షణ శాఖ ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
గత నెలలో, ఎన్ఎస్సి, పీపీఎఫ్ సహా చిన్న పొదుపుల వడ్డీ రేటును అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి 0.4 శాతానికి పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ చిన్న పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లు పెంచడం వల్ల బ్యాంకుల్లో డిపాజిట్లు భారీగా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తున్నది.