దేశవ్యాప్తంగా 300 పైగా ప్రవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు మూతబడుతున్నాయి. 2018-19 విద్యాసంవత్సరానికిగానూ.. ఈ కాలేజీల్లో ఎలాంటి అడ్మిషన్లు చేయవద్దని కేంద్ర మానవ వనరుల శాఖ సూచించినట్టు సమాచారం. ఈ నిర్ణయానికి గల కారణం సదరు కాలేజీల్లో గత ఐదేళ్లుగా ప్రవేశాలు తగ్గిపోవడమే అని ఆ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.


గత ఐదేళ్ల నుంచి 300కు పైగా ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య దారుణంగా పడిపోయింది. కనీసం 30 శాతానికి కూడా చేరుకోలేకపోతున్నారు. కాబట్టి ఆయా కళాశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రవేశాలు చేపట్టవద్దని సూచించినట్టు అధికారి తెలిపారు. అంతేగాక.. ప్రవేశాలు తగ్గిపోతున్న మరో 500 ఇంజనీరింగ్ కాలేజీలపై కూడా నిఘా పెట్టినట్టు తెలిపారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటిఈ) లో  ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3000 ప్రవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 800 కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య 50 శాతం కన్నా తక్కువగా ఉంది. 150 కాలేజీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ కాలేజీల్లో 20-30 శాతం మించి అడ్మిషన్లు జరగలేదన్నారు కేంద్ర మానవవనరుల శాఖ అధికారి ఒకరు. మూతబడనున్న కళాశాలల లిస్టులో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి 30 కళాశాలలు ఉన్నాయి.