Baby Girl Named After Biparjoy: ఆ పాపకు బిపార్జోయ్ తుపాన్ పేరు పెట్టారు
Baby Girl Named After Biparjoy: బిపర్జోయ్ తుపాన్ ధాటికి గుజరాత్‌లోని పశ్చిమ తీరం అల్లాడింది. పశ్చిమ తీరంలో బిపర్జోయ్ తుపాన్ బీభత్సం సృష్టించింది. భారీ మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది.
Baby Girl Named After Biparjoy: బిపర్జోయ్ తుపాన్ ధాటికి గుజరాత్‌లోని పశ్చిమ తీరం అల్లాడింది. పశ్చిమ తీరంలో బిపర్జోయ్ తుపాన్ బీభత్సం సృష్టించింది. భారీ మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ బిపర్జోయ్ తుపాన్ కారణంగా మరణాలు కూడా సంభవించినట్టు తెలుస్తున్నప్పటికీ.. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత లేదు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో పుట్టిన పిల్లలకు .. అవే పేర్లు పెట్టే వింత ధోరణి ప్రపంచం అంతటా ఉందనే విషయం తెలిసిందే. మన దేశం కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. తాజాగా పశ్చిమ తీరాన్ని గజగజ వణికించిన బిపర్జోయ్ తుఫాను విషయంలోనూ అదే జరిగింది. గుజరాత్‌లో అప్పుడే పుట్టిన ఒక పండంటి ఆడ బిడ్డకు ఆమె తల్లిదండ్రులు ' బిపర్జోయ్ ' అని నామకరణం చేశారు.
తుఫాను తీరం దాటిన తర్వాత పశ్చిమ తీరంలో విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉన్నందున తీర ప్రాంత వాసులను, లోతట్టు ప్రాంతాల వాసులను గుజరాత్ సర్కారు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలా ప్రభుత్వం తరలించిన వేలాది మందిలో బిపర్జోయ్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. నెల రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ ప్రస్తుతం గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని జాఖౌలో ఆశ్రయంలో ఆశ్రయం పొందుతోంది. ఆ మహిళే తన బిడ్డకు బిపర్జోయ్ అనే పేరు పెట్టింది.
చిత్ర విచిత్రమైన పేర్లు
భూకంపాలు, తుఫాన్లు, వైరల్ ఫీవర్స్ వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో పుట్టిన పిల్లలకు అలాంటి పేర్లే పెట్టడం ఇదేం కొత్త కాదు.. గతంలోనూ మనం అలాంటి పేర్లు చూశాం. అలా తమ పిల్లలకు పెట్టుకున్న పేర్లలో కరోనావైరస్ అనే పేరు కూడా ఉండటం గమనార్హం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో కరోనావైరస్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న సమయంలోనే పుట్టిన తమ బిడ్డకు కరోనా అని పేరు పెట్టుకుంది ఒక జంట. అదే కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్ కారణంగా త్రిపురలో చిక్కుకుపోయిన రాజస్థాన్ దంపతులు.. తమ శిశువుకు ' లాక్‌డౌన్ ' అని పేరు పెట్టుకోవడం వినే ఉండి ఉంటారు. అదేవిధంగా 1979 లో స్కై ల్యాబ్ పడిపోయినప్పుడు పుట్టిన పిల్లలకు కూడా స్కైల్యాబ్ అని పేరు పెట్టుకున్నారు.