గుజరాత్ లో బీజేపీకి మరోమారు భంగపాటు..!
తాజాగా గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తలపించాయి.
సోమవారం గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలు గత ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే తలపిస్తున్నాయి. గతేడాది డిసెంబరులో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే అసెంబ్లీ ఫలితాలు బీజేపీకి ఒకింత నిరాశే మిగిల్చాయి.
తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలోనూ అదే పునరావృతమైంది. బీజేపీ కొన్ని స్థానాలను కోల్పోగా, కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 75 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగ్గా, అధికార బీజేపీకి 47, కాంగ్రెస్‌కు 16, స్వతంత్రులు 4, ఎన్సీపీ, బీఎస్పీలు చెరొక స్థానాల్లో విజయం సాధించాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వరేశ్ సిన్హా తెలిపారు. ఆరు చోట్ల మాత్రం ఎవరికీ స్పష్టమైన మెజార్టీ లభించలేదు.
2013 స్థానిక సంస్థల ఎన్నికల్లో 59 పురపాలక సంఘాల్లో గెలిచిన బీజేపీ ప్రస్తుతం 47కు పరిమితమైంది. కాంగ్రెస్ తన స్థానాలను 13 నుంచి 16కు పెంచుకోగలిగింది.
గతేడాది గుజరాత్‌లోని 182 శాసనసభ స్థానాలకు డిసెంబరులో ఎన్నికలు జరగ్గా, బీజేపీ 99, కాంగ్రెస్ 77 చోట్ల గెలుపొందాయి.