హార్ధిక్ పటేల్‌కి రెండేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా
పటిదార్ సామాజికవర్గం నాయకుడు హార్థిక్ పటేల్‌కి రెండేళ్ల జైలు శిక్ష
2015లో విస్‌నగర్‌లోని బీజేపీ ఎమ్మెల్యే రుషికేష్ పటేల్ కార్యాలయం వద్ద విధ్వంసం సృష్టించిన కేసులో పటిదార్ సామాజికవర్గం నాయకుడు హార్థిక్ పటేల్‌ని దోషిగా తేల్చిన గుజరాత్‌లోని విస్‌నగర్ కోర్టు.. అతడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.50,000 జరిమానా కూడా విధిస్తున్నట్టు కోర్టు స్పష్టంచేసింది. పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్)కి కన్వినర్‌గా ఉన్న హర్థిక్ పటేల్‌తోపాటు సర్ధార్ పటేల్ గ్రూప్ (ఎస్పీజీ) కన్వినర్ లాల్జీ పటేల్, ఇదే పటేల్ ఉద్యమానికి సంబంధించిన మరో నాయకుడు అంబలాల్ పటేల్‌లను కూడా దోషులుగా తేల్చుతూ రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు.. ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున జరిమానా విధించింది.
2015, జూలై 23న మెహసనా జిల్లా విస్‌నగర్‌లో పటేల్ సామాజికవర్గం నేతలు రిజర్వేషన్ల పెంపు కోసం చేసిన ధర్నాలో విధ్వంసం చోటుచేసుకోవడంతో భారీ ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఆందోళన హింసాత్మకంగా మారడంతో ఆందోళనకారులు పలువురి ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే మీడియా సిబ్బందిపై సైతం భౌతిక దాడులు సైతం జరిగాయి. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా నిందితులలో హార్థిక్ పటేల్ పేరు కూడా ఉంది. దీంతో ఈ కేసు విచారణ చేపట్టిన విస్‌నగర్ కోర్టు.. హార్థిక్ పటేల్‌తోపాటు మరో ఇద్దరికి రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధిస్తున్నట్టు స్పష్టంచేసింది.