హర్యానాలో మరో డేరాబాబా గుట్టురట్టు.. రెండు హత్య కేసులపై తుదితీర్పు
హర్యానా ప్రాంతంలో మరో డేరాబాబా గుట్టురట్టు అయ్యింది. ప్రఖ్యాత స్వామీజీగా పేరుగాంచిన రాంపాల్ పై రెండు హత్య కేసులు నమోదు చేసిన తర్వాత.. ఎట్టకేలకు ఈ కేసులకు సంబంధించిన తీర్పును వెల్లడించనున్నట్లు హిసార్ ప్రాంత కోర్టు తెలిపింది.
హర్యానా ప్రాంతంలో మరో డేరాబాబా గుట్టురట్టు అయ్యింది. ప్రఖ్యాత స్వామీజీగా పేరుగాంచిన రాంపాల్ పై రెండు హత్య కేసులు నమోదు చేసిన తర్వాత.. ఎట్టకేలకు ఈ కేసులకు సంబంధించిన తీర్పును వెల్లడించనున్నట్లు హిసార్ ప్రాంత కోర్టు తెలిపింది. అక్టోబరు 16, 17 తేదీల్లో ఈ తీర్పును వెల్లడించాలని భావిస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. నలుగురు మహిళలతో పాటు ఓ శిశువును హత్య చేసిన కేసులో ప్రస్తుతం రాంపాల్ నిందితుడిగా ఉన్నారు. ఓ మహిళ ఆయన ఆశ్రమంలో అనుమానాస్పదంగా మరణించాక.. రాంపాల్ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి.
2014లో తొలిసారిగా పలు కేసులలో రాంపాల్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆయన నడుపుతున్న సత్ లోక్ ఆశ్రమం నుండి దాదాపు 15,000 మంది భక్తులను పోలీసులు ఖాళీ చేయించారు. సద్గురు రాంపాల్‌జీ మహరాజ్‌గా పేరు, ప్రఖ్యాతులు సంపాదించిన ఈ హర్యానా బాబా దాదాపు 100 డేరాలు, ఆశ్రమాలకు అధిపతి. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆయన ఆశ్రమాలు నెలకొల్పడం గమనార్హం.
అయితే రాంపాల్ పై హత్యకేసులు నమోదు చేసిన తర్వాత కూడా ఆయన భక్తుల్లో కొందరు ధర్నాలు చేశారు. రాంపాల్ పై పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని పలువురు ఆరోపణలు కూడా చేశారు. డేరా సచ్చా సౌధా అధిపతి రామ్ రహీం సింగ్ అరెస్టు తర్వాత.. అటువంటి డేరాలు నిర్వహిస్తున్న బాబాలపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. అక్రమాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్టు కూడా చేసింది. ఈ క్రమంలో హత్యా నేరాలపై అరెస్టు అయిన రాంపాల్ కేసులో కూడా తుది తీర్పును వెల్లడించే సమయం వచ్చిందని న్యాయస్థానం తెలిపింది.