రామమందిరం పేరిట డబ్బులు వసూలు చేస్తారా: బీజేపీపై కుమారస్వామి ఫైర్
కర్ణాటక సీఎం కుమారస్వామి శుక్రవారం బీజేపీ పార్టీపై ప్రశ్నల వర్షం కురిపించారు. `రామ మందిరం నిర్మిస్తామని చెప్పిన అనేక సంవత్సరాల నుండీ బీజేపీ నేతలు ఇక్కడికి వచ్చి డబ్బు, ఇటుకలు తీసుకెళ్లారు.
కర్ణాటక సీఎం కుమారస్వామి శుక్రవారం బీజేపీ పార్టీపై ప్రశ్నల వర్షం కురిపించారు. "రామ మందిరం నిర్మిస్తామని చెప్పిన అనేక సంవత్సరాల నుండీ బీజేపీ నేతలు ఇక్కడికి వచ్చి డబ్బు, ఇటుకలు తీసుకెళ్లారు. ఆఖరికి ఏమైంది? ఇటుకలు చెత్తకుప్పలలోకి చేరితే.. డబ్బులు నాయకుల జేబుల్లోకి వెళ్లాయి. రెండు పర్యాయాలు గెలిచినా కూడా బీజేపీ ఇప్పటికీ రామ మందిరం పేరు మీదుగానే దోపిడీ చేస్తుందని" ఆయన ఆరోపించారు.
అయితే బీజేపీ నాయకులు కుమారస్వామి వ్యాఖ్యల పై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆయన తన మాటలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలు స్వచ్ఛందంగానే ముందుకు వచ్చి ఇటుకలు దానం చేశారని.. అంతేగానీ పార్టీ బలవంతంగా ఎలాంటి వసూళ్లకు పాల్పడలేదని తెలిపారు. కుమారస్వామి తన పార్టీ గతంలో బీజేపీతో కలిసి పని చేస్తున్నప్పుడు ఈ ప్రశ్నలు ఎందుకు అడగలేదని వారు తెలిపారు.
కేవలం రాజకీయ లబ్ది కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నేతలు కుమారస్వామి పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కుమారస్వామి సర్కార్ మీద కూడా తమకు అభ్యంతరాలు ఉన్నాయని వారు తెలిపారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం లోటు బడ్జెట్‌తో సతమతమవుతుంటే.. రైతు రుణ బకాయిలు చెల్లించడానికి అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో తెలపాలని వారు అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇప్పటి వరకు ఇచ్చిన నిధులకు సంబంధించి ప్రతీ పైసాకి లెక్క చూపించాలని వారు తెలిపారు.