దేశీయ అతిపెద్ద ఫైనాన్షియర్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ(హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌) గృహ రుణాల రేట్లను పెంచేసింది. 2013 తర్వాత తొలిసారి హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. ప్రైమ్ లెండింగ్ రేటు శ్లాబులను బట్టి 20 బేసిస్ పాయింట్ల వరకు (16.15- 16.35) పెంచగా.. రూ.30 లక్షలకు పైనున్న రుణాలపై కూడా బేసిస్ పాయింట్లు పెరగనున్నాయి. రూ.30 లక్షల్లోపు రుణాలకు 5 బేసిస్ పాయింట్లు పెరగనుండగా.. మహిళా రుణ గ్రహీతలకు అన్ని శ్లాబుల్లో పెంపు 5 పాయింట్లుగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హెచ్‌డీఎఫ్‌సీ తీసుకున్న ఈ పెంపు నిర్ణయం ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుందట. గత అక్టోబరు నుంచి నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. తాజా రేట్ల ప్రకారం.. రూ. 30లక్షల వరకు తీసుకున్న రుణాలపై ప్రస్తుతం ఉన్న 8.40శాతం రేటును 8.45శాతానికి పెంచారు. అయితే మహిళా రుణగ్రహితలకు మాత్రం 8.40శాతమే వర్తించనుంది.


ఇక రూ. 30 లక్షల నుంచి రూ. 75 లక్షల మధ్య రుణాలపై రేటును ప్రస్తుతమున్న 8.40శాతం నుంచి 8.60 శాతానికి పెంచారు. మహిళా రుణగ్రహీతలకు ఇది 8.55 శాతంగా ఉండనుంది. ఇక రూ.75 లక్షల కంటే పైబడిన రుణాల రేటును 8.50శాతం నుంచి 8.70శాతానికి పెంచారు. మహిళలకు 8.65 శాతం రేటు ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.