పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు లాకెట్ ఛటర్జీ నోరుజారి ఆడిన మాటలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం తమ పార్టీ తరఫున రథయాత్ర చేస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని ఛటర్జీ అన్నారు. ఒకవేళ తమ రథయాత్రను అడ్డుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారిని చక్రాలతో తొక్కించి చంపేస్తామని ఆమె అనడంతో ప్రతిపక్షాలు ఆమెపై మండిపడ్డాయి. టీఎంసీ పార్టీ నేత పార్థా ఛటర్జీ, లాకెట్ ఛటర్జీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ నేతలు పశ్చిమ బెంగాల్‌లో ప్రాంతీయ విద్వేషాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కానీ ప్రజలు ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని క్షమించరని.. ఎన్నికలలో బీజేపీ తగిన పరాభవం పొందుతుందని పార్థా ఛటర్జీ అభిప్రాయపడ్డారు. 2019 లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌లో ప్రచారం నిమిత్తం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడు రథయాత్రలకు సంకల్పించారు.


ఈ మూడు రథయాత్రలు డిసెంబరు 5,7,9 తేదీల్లో పశ్చిమ బెంగాల్‌లోని 42 లోక్ సభ నియోజకవర్గాలనూ కవర్ చేయనున్నాయి. రథయాత్ర ముగింపు రోజున కోల్‌కతాలో జరిగే భారీ బహిరంగ సభలో భారత ప్రధాని నరేంద్రమోదీ  ప్రసంగించే అవకాశం ఉందని ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ రథయాత్రల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామని కూడా పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ  రాష్ట్ర బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.