IMD issued red alert ahead of heavy rains: న్యూఢిల్లీ: రానున్న రెండు, మూడు రోజుల పాటు దేశంలోని తూర్పు, పశ్చిమ, మధ్య భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (IMD) తెలిపింది. రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన ఐఎండీ.. ఆయా రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ (Red alert) జారీ చేసింది. అలాగే జమ్మూకశ్మీరులో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే జమ్మూకశ్మీరులోని కిష్టావర్ జిల్లా హోంజార్‌లో భారీవర్షాలు కారణంగా వరదలు పోటెత్తిన ఘటనలో ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక రాజస్థాన్‌లోని షెకావతి రీజియన్‌లోని సికార్, నాగౌర్, అజ్మీర్ జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. జైపూర్, జుంజును, టోంక్, కోట, భిల్వారా, బరన్, చురు, ఝలావర్ జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ (Orange alert) ప్రకటించారు. 


అలాగే మధ్యప్రదేశ్‌లోని 15 జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉంది.