న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జండాను ఎగురవేసి 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవం, రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశానికి స్వాతంత్య్రం సంపాదించిపెట్టిన ఎందరో మహనీయులను ప్రధాని మోదీ స్మరించుకున్నారు. అయితే, ఒకవైపు యావత్ దేశం స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో మునిగిపోగా.. మరోవైపు దేశంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు వరదల బారిన పడి నానా ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అహర్నిశలు కృషిచేస్తున్నాయని అన్నారు. 


తమ సర్కార్ రెండోసారి అధికారంలోకొచ్చిన అనంతరం తొలి 10 వారాల్లోపే అనేక కీలక సమస్యలపై తగిన నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెబుతూ.. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు చేయడంతోపాటు ముస్లిం మహిళలకు లబ్ధి కలిగించే త్రిపుల్ తలాక్ బిల్లు వంటివి అందులో కొన్ని అని అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ.. ఆనాడు సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ కన్న కలలను నిజం చేసేందుకే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు.