హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రాలో భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో స్కూలు బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో బస్సు డ్రైవరుతో సహా 20 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. ఇదే ఘటనలో మరో 40 మంది బాలలు తీవ్రగాయాల బారిన పడ్డారు. రహదారి వద్ద మలుపు తిరుగుతూ.. వాహనాన్ని అదుపు చేయడంలో డ్రైవర్ ఫెయిల్ అవ్వడంతో బస్సు సరాసరి లోయలో పడిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే అప్పటికే ఆ బస్సు ఓవర్ లోడ్‌తో వెళ్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అంత ఓవర్ లోడ్‌‌తో వెళ్తున్న బస్సును చూడగానే తమకు ఏదో అనుమానం తలెత్తిందని.. ఈ ప్రమాదం జరగడం నిజంగానే దురదృష్టకరమని వారు తెలిపారు. నూర్పూర్ నియోజకవర్గంలోకి వచ్చే మక్వాల్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు స్కూలుకి సంబంధించిన బస్సు అది అని స్థానికులు చెబుతున్నారు. 


ఈ ప్రమాద ఘటన గురించి తెలియగానే స్థానిక పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. ఆ బస్సు కెపాసిటీ 40 సీట్లే అయినప్పటికీ.. 60 మంది పిల్లలను ఎక్కించుకున్నారని తెలిపారు. మృత్యువాత పడిన పిల్లలతో పాటు గాయపడిన పిల్లలను కూడా వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించామని అధికారులు తెలిపారు. ఈ సంఘటన గురించి వార్తలు వెలువడగానే హిమాచలప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. 50 మంది డాక్టర్ల టీమ్‌ను వెంటనే పంపించింది. ప్రస్తుతం ఆయా ప్రాంత జిల్లా కమీషనర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ పరిస్థితిని అంచనా వేస్తున్నామని.. పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించామని తెలిపారు