Himachal Pradesh Crisis: హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో ఆ రాష్ట్రంలో ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్ధకమైంది. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించేందుకు బీజేపీ సిద్ధం కాగా, కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమై అనూహ్య పరిణామాలతో ప్రభుత్వాన్ని రక్షించుకుంది. లోక్‌సభ ఎన్నికల ముందు జరిగిన పరిణామం కావడంతో కాంగ్రెస్ పార్టీలో ఆందోళన రేగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనూహ్య పరిణామాలతో కూలిపోయే ప్రమాదం నుంచి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం గట్టెక్కింది. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖూ ప్రభుత్వం అనూహ్యరీతిలో ఎత్తుకు పైఎత్తు వేయడంతో సంక్షోభం నుంచి బయటపడింది. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖూపై అసంతృప్తితో ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకు అనుకూలంగా రాజ్యసభ ఎన్నికల్లో ఓటేశారు. దాంతో కాంగ్రెస్ అభ్యర్ధి అభిషేఖ్ మనూ సింఘ్వీ ఓడిపోయారు. అదే సమయంలో హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్  రాజీనామా చేశారు. రాష్ట్రంలో మొత్తం 68 స్థానాలుంటే కాంగ్రెస్ పార్టీకు 40, బీజేపీకు 25, ఇండిపెండెంట్ ముగ్గురు ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల నేపధ్యంలో ప్రభుత్వం పడిపోయే స్థితికి చేరుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు బీజేపీ ప్రయత్నించింది. 


అంతే ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భూపేష్ బఘేల్, భూపేందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్‌లను పరిశీలకులుగా అక్కడికి పంపింది. స్పీకర్ పై దాడికి ప్రయత్నించారనే అభియోగంతో అసెంబ్లీ నుంచి 15 మంది బీజేపీ ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేసింది. వెంటనే బడ్జెట్ పాస్ చేసుకుని అసెంబ్లీని నిరవధిక వాయిదా వేసేసింది. క్రాస్ ఓటింగ్ చేసిన ఆరుగురు ఎమ్మెల్యేలపై వేటు ప్రక్రియ వాయిదా పడింది. 


రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి హర్ష్ మహాజన్ వర్సెస్ కాంగ్రెస్ అభ్యర్ధి అభిషేక్ మనూ సింఘ్వీలకు చెరో 34 ఓట్లు వచ్చాయి. బీజేపీకు ఉన్న 25 మందితో పాటు ఆరుగురు కాంగ్రెస్, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఓటేయడంతో ఆ పార్టీకు 34, కాంగ్రెస్ అభ్యర్ధికి 34 ఓట్లు వచ్చాయి. దాంతో లాటరీలో బీజేపీ అభ్యర్ధి విజయం సాధించారు. ఇక అసెంబ్లీలో మెజార్టీకు కావల్సిన మేజిక్ ఫిగర్ 35.  రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 34 మాత్రమే. అందుకే ప్రభుత్వం మైనార్టీలో పడింది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం 15 మందిని సస్పెండ్ చేసి బడ్జెట్ పాస్ చేసి ప్రభుత్వాన్ని రక్షించుకుంది. 


ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రతిపక్షాల కుట్రను భగ్నం చేశామని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖూ తెలిపారు. పూర్తిగా ఐదేళ్లు ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే తమను సస్పెండ్ చేశారని బీజేపీ పక్ష నేత ఆరోపిస్తున్నారు. మొత్తానికి తాత్కాలికంగా కాంగ్రెస్ ప్రభుత్వం గట్టెక్కింది. ఆరుగురిపై వేటు ప్రక్రియ త్వరగా పూర్తయితే ఇప్పట్లో ప్రభుత్వానికి ఇబ్బంది రాదు. 


Also read: Jharkhand Train Accident: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్ర‌మాదం.. 12 మంది దుర్మ‌ర‌ణం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook