దివంగత భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయికి అరుదైన గౌరవం దక్కింది. హిమాలయాల్లో ఓ పర్వత శిఖరానికి అటల్‌ బిహారి వాజ్‌పేయి పేరు పెడతామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. ‘వాజ్‌పేయి వల్లే ఉత్తరఖండ్‌ రాష్ట్రం ఏర్పడింది. ఆయన మా రాష్ట్ర ప్రజలకు చేసిన మేలును ఎప్పటికీ మరవం. వాజ్‌పేయి ప్రకృతి ప్రేమికుడు. అందువల్లే హిమలయాల్లోని ఓ పర్వతానికి వాజ్‌పేయి పేరు పెట్టాలని నిర్ణయించాం. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాం’ ఆ రాష్ట్ర పర్యటన మంత్రి సత్పాల్ మహారాజ్ తెలిపారు. ఇంతవరకు గుర్తించని ఓ పర్వత శిఖరాన్ని గుర్తించేందుకు త్వరలోనే ఓ పర్వతారోహకులు బృందం వెళ్తుందని మంత్రి వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాజ్‌పేయి మరణించిన తరువాత అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఆమోదంతో మాజీ ప్రధాని గౌరవార్థం తమ ప్రాంతాల్లోని అనేక ప్రాంతాల పేర్లను మార్చాలని  నిర్ణయించుకున్నాయి. ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు అటల్‌ బిహారి వాజ్‌పేయ్‌ ప్రధానిగా ఉన్న కాలంలోనే ప్రత్యేక రాష్ట్రాలుగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.. !


ఈ క్రమంలోనే జార్ఖండ్ ప్రభుత్వం..రాష్ట్రంలోని ఏడు ప్రాంతాలకు వాజ్‌పేయి పేరు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. అలాగే చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ త్వరలో నిర్మించబోయే నూతన రాజధాని ‘నయా రాయ్‌పూర్‌’ను ‘అటల్ నగర్‌’గా పేరు మారుస్తామని ప్రకటించారు.


అంబాలా నగరంలోని బాల్ భవన్‌లో నిర్మించాల్సిన ప్లానిటోరియానికి మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి పేరు పెట్టనున్నట్లు అంబాలా నగర ఎమ్మెల్యే అసీమ్ గోయల్ ప్రకటించారు.


గుజరాత్‌లో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మాట్లాడుతూ.. అటల్ జీ గౌరవార్థం సబర్మతి నది వద్ద ఉన్న ఘాట్‌కు 'అటల్ ఘాట్‌'గా పేరు పెడుతున్నట్లు తెలిపారు.