హిందు మత సంప్రదాయాల గురించి ప్రచారం చేసే హిందూ మహాసభ వెబ్ సైటును కొందరు హ్యాకర్లు హ్యాక్ చేశారు. అంతటితోనే వారు ఆగకుండా.. ఆ సైటులో కొన్ని ఆర్టికల్స్ పోస్టు చేశారు. బీఫ్‌తో ఎన్ని రకాల వంటకాలు వండవచ్చో  తెలపడమే ఆ ఆర్టికల్స్ సారాంశం. "టీమ్ కేరళ సైబర్ వారియర్స్" పేరు మీద ఈ వెబ్ సైటును హ్యాక్ చేశామని చెబుతూ ఓ సందేశాన్ని కూడా వారు పోస్టు చేశారు. " మేము మనుష్యులను వారి వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవిస్తాం.. అంతేగానీ..ఆహారపు అలవాట్లను బట్టి కాదు" అని కూడా హ్యాకర్లు ఆ సైటులో పోస్టు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాదాపు మూడు గంటల పాటు కొందరు సాంకేతిక నిపుణులు ప్రయత్నించి తిరిగి సైటును యథాస్థితికి తీసుకొచ్చారు. అప్పటి వరకూ హ్యాకర్లు పోస్టు చేసిన బీఫ్ వంటకాల సందేశం హిందూ మహాసభ వెబ్ సైటులో కనిపించడం గమనార్హం. అయితే ఈ హ్యాకింగ్ విషయంపై హిందూ మహాసభ నుండి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం కూడా విడుదల కాలేదు. అయితే కేరళ వరదల నేపథ్యంలో హిందూ మహాసభ ప్రతినిధి చక్రపాణి మాట్లాడుతూ "కేరళ వరద ప్రాంతాల్లో బీఫ్ తినేవారికి ఎలాంటి సహాయం చేయవద్దు" అని తెలపడం వల్లే నెటిజన్లలో అలజడి రేగిందని.. అందుకే సైట్ హ్యాక్ చేశారని కూడా పలువురు అంటున్నారు.


చక్రపాణి లాంటి వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని.. కొన్ని వర్గాలను రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడడం వలనే.. సైట్ హ్యాక్ చేశారని కూడా కొందరు అంటున్నారు. చక్రపాణి కేరళ వరద బాధితుల విషయాన్ని ప్రస్తావిస్తూ.. బీఫ్ తినేవారిని కాపాడడం పాపమని.. అందుకే బీఫ్ తినని వారిని మాత్రమే వరద ప్రాంతాల్లో కాపాడాలని ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ పలు వర్గాల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇలాంటి వైపరీత్యాలు జరుగుతున్న సమయాల్లో చక్రపాణి లాంటి వారు మాట్లాడుతున్న మాటలు మరింత బాధ కలిగిస్తున్నాయని.. ఆయన అలాంటి మాట్లాడడం తగదని కొందరు ఆయనకు హితవు పలికారు.