హిందువులు మటన్ ఎందుకు తినకూడదంటే? - సుభాష్ చంద్రబోస్ మనవడి స్టేట్ మెంట్
భారతదేశంలో రోజు రోజుకీ గోసంరక్షణ పేరుతో ఆగడాలు పెరిగిపోతున్న క్రమంలో.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముని మనవడు చంద్రకుమార్ బోస్ ట్విట్టర్‌లో ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు.
భారతదేశంలో రోజు రోజుకీ గోసంరక్షణ పేరుతో ఆగడాలు పెరిగిపోతున్న క్రమంలో.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముని మనవడు చంద్రకుమార్ బోస్ ట్విట్టర్‌లో ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. హిందువులు మటన్ తినడం మానేయాలని.. ఎందుకంటే స్వయానా మహాత్మ గాంధీ మేక పాలు తాగుతూ.. మేకలను తల్లులతో సమానంగా చూసేవారని తెలిపారు. "గాంధీజీ మా తాతగారైన శరత్ చంద్రబోస్ ఇంట్లో కొన్నాళ్లు ఉన్నారు. ఆ ఇల్లు కోల్‌కతాలోని ఉడెన్ బర్గ్ పార్కు దగ్గర ఉండేది. ఆ సమయంలో గాంధీజీ తనకు ప్రతీ రోజు మేకపాలు తాగే అలవాటు ఉందని చెప్పారు. ఆయన కోసం రెండు మేకలను కూడా ఆయన అనుయాయులు తీసుకొచ్చారు. ఆ రోజు నుండి ఆయన ఆ మేకలను తన తల్లులతో సమానంగా చూస్తానని తెలిపారు. అందుకే హిందువులకు గాంధీజీ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా మటన్ తినడం మానేయాలి" అని చంద్రకుమార్ బోస్ తెలిపారు.
అయితే బోస్ ట్వీట్‌కి త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ స్పందించారు. "ఈ మాటలు చంద్రకుమార్ బోస్ గారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే.. నాకు తెలిసి గాంధీ లేదా సుభాష్ చంద్రబోస్ గానీ మేకలను తల్లులుగా పూజించాలని ఎక్కడా చెప్పలేదు. అలాగే గాంధీజీ కూడా ఎప్పుడూ తాను హిందువులకు రక్షకుడినని పేర్కొనలేదు. గాంధీ పుట్టక ముందు నుండే హిందువులు గోవులను మాతలుగా కొలుస్తున్నారు గానీ మేకలను కాదు. మీరు దయచేసి విషయాన్ని తప్పుదారి పట్టించవద్దు" అని పేర్కొన్నారు.
అయితే ఆ జవాబుకి చంద్రకుమార్ బోస్ కూడా తనదైన రీతిలో స్పందించారు. "గాంధీజీ మా ఇంటిలో నివసించినప్పుడు మేకపాలు తాగుతూ.. ఆ జీవి తనకు తల్లితో సమానం అని అనడం నేను స్వయంగా విన్నాను. ఈ విషయంలో మీరనుకున్న వివాదం గానీ.. వాదన గానీ లేదు" అన్నారు.
దానికి రాయ్ కూడా జవాబిచ్చారు. "మేకను గాంధీజీ తల్లిగా భావించినా.. భావించకపోయినా నాకు సమస్య లేదు. గాంధీ ప్రియశిష్యుడైన నెహ్రు కుటుంబీకులందరూ కాశ్మీర్ పండిట్లే. వారందరూ మటన్ తినలేదంటారా.." అని ప్రశ్నించారు రాయ్. అయితే రాయ్ ట్వీట్‌కి బోస్ వివరణ ఇచ్చారు. "నేను ఏ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని.. ఆ సమస్య పరిష్కారం కోసం ట్వీట్ చేశానో మీరు అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ రోజు కొన్ని ముఠాలు కావాలనే ఎక్కడపెడితే అక్కడ దాడులు చేస్తూ దేశం మొత్తం హింసను ప్రేరేపిస్తున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాల్సిందే" అని తెలిపారు.