5 సంవత్సరాల్లో 500 లగ్జరీ కార్లను.. చోరీ చేసిన హైదరాబాద్ దొంగ
హైదరాబాద్‌కు చెందిన సఫ్రుద్దీన్ కొంతమంది స్నేహితులతో కలిసి గతకాలంగా ఢిల్లీలో కార్ల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అధునాతనమైన సాఫ్ట్ వేర్, జీపీఎస్‌తో పాటు లేటెస్ట్ మొబైల్ టెక్నాలజీని ఉపయోగించి సఫ్రుద్దీన్ ఈ దొంగతనాలకు పాల్పడేవాడు
హైదరాబాద్‌కు చెందిన సఫ్రుద్దీన్ కొంతమంది స్నేహితులతో కలిసి గతకాలంగా ఢిల్లీలో కార్ల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అధునాతనమైన సాఫ్ట్ వేర్, జీపీఎస్‌తో పాటు లేటెస్ట్ మొబైల్ టెక్నాలజీని ఉపయోగించి సఫ్రుద్దీన్ ఈ దొంగతనాలకు పాల్పడేవాడు. ప్రతీ నెల ఢిల్లీకి తన టీమ్‌తో సహా హైదరాబాద్ నుండి వచ్చే సఫ్రుద్దీన్ తొలుత తాను దొంగతనం చేయాలనుకొనే కారును ఎంచుకొనేవాడు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా ఆ వాహనానికి ఓ ట్రాకింగ్ పరికరాన్ని అమర్చేవాడు.
ఆ తర్వాత జీపీఎస్ ద్వారా ఆ కారు ఎక్కడకు వెళ్తుంది.. ఎలా వెళ్తుంది.. లాంటి వివరాలన్నీ సేకరించేవాడు. ఆ వివరాలను బట్టి ఆ కారుని తన జట్టుతో సహా అనుసరించేవాడు. ఏదైనా నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆ కారు ఆగితే చాలు.. తమ వద్ద ఉన్న నకిలీ తాళాలతో ఆ కారు తలుపు తెరిచి అక్కడ నుండి ఉడాయించేవాడు. ఆ విధంగా ఢిల్లీ, యూపీ, హర్యానా పరిసర ప్రాంతాల్లో గత అయిదు సంవత్సరాలుగా సఫ్రుద్దీన్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. దాదాపు ఈ అయిదు సంవత్సరాల్లో 500 లగ్జరీ కార్లను ఈ హైటెక్ దొంగ దొంగలించినట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ కార్ల దొంగతనం కేసును సీరియస్‌గా, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఓ లగ్జరీ కారు దొంగతనం జరగగానే.. తమకు ఫిర్యాదు అందిన కొద్ది గంటల్లోనే దానిని పట్టుకోవాలని నిశ్చయించుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు, సీసీ కెమెరాల సహాయం తీసుకొని.. దొంగలు ఏ కారులో వెళ్తున్నారో.. ఆ కారును వెంబడిస్తూ.. ఎట్టకేలకు ఢిల్లీలోని గగన్ సినిమా హాల్ వద్ద సఫ్రుద్దీన్ గ్యాంగ్‌ను పట్టుకున్నారు.
అయితే గ్యాంగ్ అక్కడ నుండి ఉడాయించి దాదాపు 50 కిమీల వరకు పోలీసులకు పరీక్ష పెట్టింది. ఆఖరికి అదనపు బలగాలను రప్పించి ప్రగతి మైదాన్ ప్రాంతంలో ఈ కార్ల దొంగను అరెస్టు చేశారు పోలీసులు. సఫ్రుద్దీన్ గ్యాంగ్ సభ్యులు అప్పుడప్పుడు పారిపోయే క్రమంలో ఆయుధాలు కూడా ఉపయోగించేవారు. జూన్ 5వ తేదిన వివేక్ విహార్ ప్రాంతంలో తమ కారును అడ్డగించిన పోలీసులపై ఈ గ్యాంగ్ కాల్పులు కూడా జరిపి తప్పించుకుంది.
ఆ తర్వాతే ఈ గ్యాంగ్ పై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఎట్టకేలకు వారిని ప్రగతి మైదాన్ వద్ద పట్టుకున్నారు. అయితే ఈ కార్ల దొంగతనాలకు సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలను పోలీసులకు సఫ్రుద్దీన్ చెప్పడం గమనార్హం. తాము ప్రతీ సంవత్సరం 100 కార్లు దొంగతనం చేయాలని టార్గెట్ పెట్టుకుంటామని.. ఒక కారు దొంగతనం చేసి అమ్మేయగానే వెంటనే విమానమెక్కి హైదరాబాద్ వెళ్లిపోతామని.. కనీసం నాలుగు రోజులు రెస్టు తీసుకొని మళ్లీ వచ్చి మరో కారు వేటలో పడతామని సఫ్రుద్దీన్ తెలపడంతో ఆశ్చర్యపోవడం పోలీసులు వంతైంది.