నీరవ్ మోదీకి బ్యాంకు లోన్ ఎలా ఇచ్చిందో తెలపాల్సిందే: ముంబయిలో ఆర్టీఐ పిటీషన్
పంజాబ్ నేషనల్ బ్యాంకు, గీతాంజలి జెమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ నీరవ్ మోదీకి లోన్ ఇచ్చిన క్రమంలో ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుందో తెలపాలని కోరుతూ ముంబయికి చెందిన అనిల్ గల్గాలి సమాచార హక్కు చట్టం ప్రకారం ఆ బ్యాంకుకి దరఖాస్తు చేసుకొన్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు, గీతాంజలి జెమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ నీరవ్ మోదీకి లోన్ ఇచ్చిన క్రమంలో ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుందో తెలపాలని కోరుతూ ముంబయికి చెందిన అనిల్ గల్గాలి సమాచార హక్కు చట్టం ప్రకారం ఆ బ్యాంకుకి దరఖాస్తు చేసుకొన్నారు. అయితే ఆ దరఖాస్తును బ్యాంకు తోసిపుచ్చడం గమనార్హం. ప్రస్తుతం బ్యాంకు లావాదేవీలకు సంబంధించి నీరవ్ మోదీపై కేసు నడుస్తున్న క్రమంలో.. పలు సెక్యూరిటీ కారణాల వల్ల ఆ వివరాలు బహిర్గతం చేయలేమని బ్యాంకు అధికారులు తెలిపారు.
సమాచార హక్కు చట్టంలోని 8 (1) హెచ్ నిబంధన ప్రకారం అనిల్ దరఖాస్తును రిజెక్ట్ చేస్తున్నామని బ్యాంకు అధికారులు తెలిపారు. నీరవ్ మోదీ బ్యాంకుకు ఎలాంటి సందర్భంలో లోన్‌కి అప్లై చేసుకున్నారు? లోన్ ఇవ్వడానికి ముందు బ్యాంకు ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది? లోన్ మంజూరు చేసేముందు జరిగిన మినిట్స్ ఆఫ్ మీటింగులో పాల్గొన్న బ్యాంకు అధికారులు ఎవరు? లాంటి వివరాలను ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిందిగా అనిల్ తెలిపారు.
ఇటీవలే నీరవ్ మోదీకి సంబంధించిన కేసులో బ్యాంకు నుండి సొమ్ము కొల్లగొట్టే క్రమంలో ఆయన హవాలా వ్యాపారస్థుల సహాయం తీసుకున్నారని ఓ వార్త హల్చల్ చేసింది. నీరవ్ మోదీ తన మామయ్య మెహుల్ చోక్సీ సహాయంతో ఒక ప్రణాళిక ప్రకారమే బ్యాంకుకు ఎగనామం పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. హవాలా ద్వారా డబ్బు కొల్లగొడుతున్న సందర్భంలో నీరవ్ మోదీ పలు నకిలీ కంపెనీ పత్రాలు కూడా తయారుచేశారని.. ఆ కంపెనీల పేరుతో బ్యాంకు ఖాతాలు ప్రారంభించి.. హవాలా లావాదేవీలు చేసినట్లు కూడా పలు వార్తలు వచ్చాయి. హాంగ్ కాంగ్, దుబాయ్ కేంద్రాలుగా ఈ హవాలా లావాదేవీలు చేసినట్లు తెలుస్తోంది.