వాజ్‌పేయి, నవాజ్ షరీఫ్‌ని కౌగలించుకున్నప్పుడు నోరు మెదపలేదేం? బీజేపీ నేత ప్రశ్న
బీజేపీ నేత మరియు సినీ నటుడు శతృఘ్న సిన్హా మళ్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
బీజేపీ నేత మరియు సినీ నటుడు శతృఘ్న సిన్హా మళ్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. పాకిస్తాన్ వెళ్లి అక్కడి ఆర్మీ అధిపతిని సిద్ధూ కౌగలించుకోవడంలో తనకు తప్పేమీ కనిపించలేదని శతృఘ్న సిన్హా తెలిపారు. గతంలో కూడా మాజీ ప్రధాని వాజ్‌పేయి, అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ని కలిసి మాట్లాడినప్పుడు ఆలింగనం చేసుకున్నారని.. అలాగే మోదీ ప్రధాని అయ్యాక కూడా పాకిస్తాన్‌కు వెళ్లి నవాజ్ షరీఫ్‌ను కౌగలించుకున్నారని.. మళ్లీ అప్పుడు ఈ విషయాలపై స్పందించని వారు ఇప్పుడు సిద్ధూ విషయంలో స్పందించడమేంటని శతృఘ్న సిన్హా ప్రశ్నించారు.
పైగా ఈ విషయంపై సిద్ధూ తన వైఖరి ఏమిటో కూడా చెప్పారని.. అయినా కొందరు నేతలు రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని సిన్హా అన్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లినప్పుడు మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాక్ ఆర్మీ అధిపతి కమర్ జావేజ్ బజ్వాని కౌగలించుకున్నారు. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పలువురు బీజేపీ నేతలు సిద్ధూపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతీయ సైనికుల మరణానికి కారణమవుతున్న పాక్ ఆర్మీ అధిపతిని ఆలింగనం చేసుకొని ఒక దేశద్రోహిలా సిద్ధూ ప్రవర్తించారని పలువురు బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు.
కోల్‌కతాలో జరిగిన ఒక సమావేశంలో శతృఘ్నసిన్హా సిద్ధూ విషయంపై స్పందించారు. సిద్ధూ చేసిన పనిలో తనకు తప్పేమీ కనిపించలేదని తెలిపారు. బీజేపీ పట్ల తనకు ఎలాంటి వ్యతిరేకత అనేది లేదని, తాను ఎప్పటికీ బీజేపీ నేతనేనని ఆయన అన్నారు. అయితే పార్టీలో కొందరు వ్యక్తులు చేసే పనులు నచ్చనప్పుడు.. సద్విమర్శలు చేయవచ్చని.. అలా విమర్శలు చేసినంత మాత్రాన తాను పార్టీకి వ్యతిరేకమైనట్టు కాదని ఆయన తెలిపారు. కొందరు వ్యక్తుల కంటే పార్టీయే గొప్పదని చెప్పే నానాజీ దేశ్‌ముఖ్, అటల్‌బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ మాటలు తనకు ఆదర్శమని సిన్హా తెలిపారు.