Cinematic Crime Sory: 13 ఏళ్ల మైనర్ బాలిక కిడ్నాప్.. పెళ్లి పేరుతో 15 మందికి అమ్మకం.. ప్రతీ చోట ఒక కిడ్నాప్
Minor Girl Kidnapped and Sold As Bride To 15 Men: బాప్రే !! మనుషులు ఇలా కూడా ఉంటారా ? డబ్బుల కోసం ఎంత అరాచకానికైనా తెగబడతారా ? ఈ రియల్ క్రైమ్ స్టోరీ గురించి వింటే ముందుగా మీకు వచ్చే భయంకరమైన ఫీలింగ్ ఇది. 13 ఏళ్ల ఒక మైనర్ బాలికను అపహరించిన ఓ కిడ్నాపర్ల ముఠా.. ఆ అమ్మాయిని వాడుకుని సాగించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.
Minor Girl Kidnapped and Sold As Bride To 15 Men: ట్విస్టుల మీద ట్విస్టులతో సినిమాను మించిన ఈ రియల్ క్రైమ్ స్టోరీ గురించి తెలుసుకుంటే ఒళ్లు జలదరించడం ఖాయం. ఇదిగో ఈ ఫోటోలో కుడివైపు నుంచి కనిపిస్తున్న మూడో వ్యక్తి పేరు అశోక్ పటేల్. గుజరాత్ కి చెందిన అశోక్ పటేల్.. గుజరాత్ తో పాటు రాజస్థాన్, మహారాష్ట్రలో పాల్పడిన నేరాల సంఖ్య అన్ని ఇన్నీ కావు. లెక్కపెడుతూ పోతే లెక్కలేనన్ని నేరాలు.. లెక్కలేనన్ని ఐపిసి సెక్షన్లు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. గీత ( పేరు మార్చడం జరిగింది ) అనే 13 ఏళ్ల మైనర్ బాలికను అపహరించిన అశోక్ పటేల్.. ఆ మైనర్ బాలికను వధువు దొరకని పెళ్లి కాని 30 ఏళ్ల యువకుల నుంచి 45 ఏళ్ల నడి వయస్సు పురుషులకు రూ. 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు ధరకు అమ్మేసి సొమ్ము చేసుకోవడం ఒక నేరం. అయితే, ఈ నేరం ఒక్కసారితో సరిపెట్టుకోలేదు. గీతను వాడుకుని 15 మంది అమ్మాయిలను కిడ్నాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నాడు ఈ దుర్మార్గుడు.
అదెలా అంటే..
గీతను పెళ్లి పేరుతో పురుషులకు విక్రయించడం అశోక్ పటేల్ పని. ఆ తరువాత అశోక్ పటేల్ అండ్ గ్యాంగ్ అదే గీతను వాడుకుని.. ఆమె ఎక్కడైతే పెళ్లి చేసుకుని నివాసం ఉంటుందో.. అక్కడి ప్రాంతం నుంచే ఇతర మైనర్ బాలికలను అపహరించే పని అశోక్ పటేల్ అండ్ గ్యాంగ్ చూసుకుంటుంది. వారికి గీత సహకరిస్తుంటుంది. తాము అనుకున్నది నెరవేరాకా అశోక్ పటేల్ అండ్ గ్యాంగ్ గీతను కూడా అక్కడి నుంచి తీసుకుని పరారు అవుతుంది.
సీన్ కట్ చేస్తే.. మళ్లీ మరొకరికి పెళ్లి పేరుతో గీతను నవ వధువులా విక్రయించడం... అక్కడ కూడా సేమ్ క్రైమ్ రిపీట్ చేయడం అశోక్ పటేల్ అండ్ గ్యాంగ్ పని. ఇలా గత 8 ఏళ్లలో అశోక్ పటేల్ చేతిలో మోసపోయిన పురుషుల సంఖ్య 8 వరకు ఉందని ప్రస్తుతానికి తెలుస్తున్నప్పటికీ.. అసలు సంఖ్య అంతకంటే ఎక్కువే ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అపహరించిన 15 మంది బాలికలను కూడా ఇలాగే మరొకరికి అమ్మేయడం అశోక్ పటేల్ అండ్ గ్యాంగ్ చేస్తోన్న ఫుల్ టైమ్ బిజినెస్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదొక హ్యూమన్ ట్రాఫికింగ్ రాకెట్ కి పాల్పడుతున్న ముఠా అన్నమాట.
అహ్మెదాబాద్ జిల్లా కంబా ప్రాంతంలో మే 11న కిడ్నాప్ అయిన ఒక టీనేజ్ బాలికను ట్రేస్ చేసినప్పుడు ఈ ముఠా గుట్టురట్టయింది. అహ్మెదాబాద్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అశోక్ పటేల్ నేరాలు దేశంలో ఇంకెన్ని రాష్ట్రాలకు విస్తరించాయి, ఏంటనేది ఇన్వెస్టిగేషన్ పూర్తయితే కానీ తెలిసే ఛాన్స్ లేదు.