నోట్ల రద్దును ఒకప్పుడు సమర్ధించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్.. తాజాగా ఆ నిర్ణయాన్ని ప్రశ్నించారు. అప్పట్లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తాను సమర్ధించానని అన్నారు. కానీ నోట్ల రద్దు నిర్ణయం కొందరు సంపన్నులకే  ప్రయోజనం చేకూరిందని అన్నారు. సంపన్నులు కొందరు తమ వద్ద ఉన్న సొమ్మును ఒక చోట నుంచి మరో చోటుకి తరలించుకునేందుకే ఉపయోగపడిందని నితీశ్ విమర్శించారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


'నోట్ల రద్దును ఒకప్పుడు సమర్ధించినా.. దాంతో ఎంత మంది పేదలకు లాభం చేకూరిందనేది తెలియాల్సి ఉంది. చాలా మంది పెద్ద వ్యక్తులు నోట్లను సులువుగా మార్చుకున్నారు' అని శనివారం తెలిపారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రయోజనం పొందిందెవరని నితీశ్ ప్రశ్నించారు.



 


'చిరువ్యాపారులు,సామాన్యుల వద్ద నుండి బ్యాంకులు ఇచ్చిన రుణాలను వడ్డీతో సహా రికవర్ చేసుకుంటాయి. మరి బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని ఎగనామం పెట్టినవాళ్లు, కనిపించకుండా పోయిన ఆ శక్తివంతమైన వ్యక్తులు గురించి ఏమంటారు?' అని ప్రశ్నించారు. బ్యాంకింగ్ వ్యవస్థను విమర్శించడం లేదని, ఆందోళన చెందుతున్నానని.. బ్యాంకింగ్ వ్యవస్థలో సంస్కరణలు అవసరం అని చెప్పారు. కాగా జేడీయూ తమతో కలిసిందని.. నాలుగేళ్ల పాలనపై ప్రత్యేక ప్రసంగంలో అమిత్ షా చెప్పిన రోజునే ఆ పార్టీ అధినేత ఇలా మాట్లాడటం గమనార్హం.