ఇంకో 4 రోజులే మిగిలి వుంది : రజినీకాంత్
`మీట్ అండ్ గ్రీట్` పేరిట తన అభిమానులతో వరుస సమావేశాలు నిర్వహిస్తోన్న తమిళ తళైవా రజనీకాంత్ తన రాజకీయ రంగ ప్రవేశంపై అభిమానులకి ఓ క్లారిటీ
'మీట్ అండ్ గ్రీట్' పేరిట తన అభిమానులతో వరుస సమావేశాలు నిర్వహిస్తోన్న తమిళ తళైవా రజనీకాంత్ తన రాజకీయ రంగ ప్రవేశంపై అభిమానులకి ఓ క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తోన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన వారితో భేటీ అవడం ప్రాధాన్యతని సంతరించుకుంది. డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు రజినీ తన అభిమానులతో భేటీ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చెన్నైలోని శ్రీ రాఘవేంద్ర కళ్యాణ మండపంలో జరుగుతున్న ఈ సమావేశాలకి రజినీ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.
ఇదిలావుంటే, తాజాగా అభిమానులతో జరిగిన భేటీలో అభిమానుల కోరిక మేరకు తన రాజకీయ రంగ ప్రవేశంపై స్పందించిన ఆయన.. మరో నాలుగు రోజులు ఓపిక పడితే, తానే అన్ని వివరాలని ప్రకటిస్తానని స్పష్టంచేశారు. అయితే, ఎవరికైనా సరే తమ కుటుంబం తర్వాతే ఏదైనా అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని రజినీకాంత్ అభిమానులకి విజ్ఞప్తిచేశారు. ఇదే విషయాన్ని తాను మొదటి నుంచీ పదే పదే చెబుతున్నందున తన మాటల్ని ఎవ్వరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు రజినీ. ఎవరికైనా సరే వారి మొదటి ప్రాధాన్యత వాళ్ల పిల్లలే కావాలని.., వారిని బాగా చదివించి ఉన్నత స్థాయిలోకి తీసుకోవాలని సలహా ఇచ్చిన సూపర్ స్టార్.. తల్లిదండ్రులని సైతం జీవించి ఉన్న దైవాలుగా భావించి గౌరవించాలని అభిమానులకి సూచించారు.