ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆదివారం మహారాష్ట్రలోని ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ,  ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో ఓ ముస్లిం వ్యక్తిని పశువుల దొంగగా భావించి స్థానికులు కొట్టి చంపిన సంఘటన గురించి ప్రస్తావిస్తూ, 'మీ హక్కుల కోసం పోరాడండి. సజీవంగా ఉండాలని కోరుకుంటే మీ అభ్యర్థికి ఓటు వేయండి. మీ అభ్యర్థులను గెలిపించండి' అని ముస్లిం ఓటర్లకు సూచించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'మీరు సెక్యులరిజం సజీవంగా ఉండాలని కోరుకుంటే, మీ హక్కుల కొరకు పోరాడండి. రాజకీయ శక్తిగా మారాలంటే, మీ (ముస్లిం) అభ్యర్థులకు ఓటు వేయండి. ముస్లింలు రాజకీయ శక్తిగా మారితే, లౌకికవాదం మరియు ప్రజాస్వామ్యం బలపడతాయి' అని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.



 


భారతీయ ముస్లింలు మరోసారి దేశాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేయాలని అంతకుముందు హాపూర్ జిల్లాలో జరిగిన ఉందంతాన్ని ప్రస్తావిస్తూ వీడియో ఒకదాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇందులో ముస్లిం వ్యక్తిని తీవ్రంగా కొట్టడంతో రక్తమోడుతున్న దృశ్యం కనిపిస్తోంది. ఈ దేశం రువాండా మార్గంలో వెళుతోందన్నారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటన సిగ్గుపడేదిగా ఉందని ఒవైసీ అభివర్ణించారు. 1994లో రువాండాలో జరిగిన మారణకాండలో 8 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. టుట్సి తెగలవారిని హుటు వేర్పాటువాదులు లక్ష్యంగా చేసుకుని మారణకాండ సృష్టించారు.