ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులంటే జరిమానా
మీ పేరు మీద ఒకటి ఎక్కవ పాన్ కార్డులున్నాయా ? అయితే వెంటనే ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు...ఒక వేళ అలా చేయకుంటే చర్యలు తప్పేలా లేదు.. మా పేరు ఉన్నది ఎవరికి తెలుస్తుందిలే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇటీవలే పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసిన విషయం తెలిసిందే.
ఆధార్ కార్డు ఆధారం చేసుకొని దొంగ పాన్ కార్డు వ్యవహారం పసిగట్టవచ్చు. ఇన్‌కమ్‌టాక్స్ చట్టంలోని సెక్షన్ 139ఎ ప్రకారం ఏ వ్యక్తీ ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండకూడదు...ఒక వేళ అలా ఉంటే సెక్షన్ 272బి ప్రకారం రూ.10 వేలు జరిమానా విధించే అధికారం ఉంటుంది. తీవ్రతను బట్టి మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
* పన్ను చెల్లింపు భారం తగ్గించుకునేందుకు చాలా మంది ఉద్దేశపూర్వకంగానే ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉపయోగిస్తుంటారు.
* బ్యాంకుల్లో క్రెడిట్ హిస్టరీ సరిగాలేని కొందరు వ్యక్తులు కొత్తగా లోన్ కోసం దరఖాస్తు చేసేందుకు రెండో పాన్ కార్డు ఉపయోగిస్తుంటారు
* తమ పాన్ కార్డు పోయినప్పుడు తెలియక కొందరు డూప్లికేట్ పాన్ కార్డుకు బదులు మరో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తుంటారు.
* పెళ్లయిన తర్వాత మహిళలు తమ ఇంటి పేరు మార్పు కోసం సమాచారాన్ని అప్‌డేట్ చేయించుకుంటే సరిపోతుంది. ఈ విషయం తెలియక చాలా మంది మహిళలు కొత్త పాన్ కార్డు కోసం అప్లయ్ చేస్తుంటారు.
కారణం ఏదైనప్పటికీ.. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండడం చట్టరీత్యా నేరం..అది చట్ట విరుద్ధం. ఇలా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్న వ్యక్తులు తమ పాన్ కార్డులను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్దతుల్లో తమ రెండో పాన్ కార్డును రద్దు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం incometaxindia.gov.in వెబ్ సైట్ చూడగలరు..