అస్సాంలో 5 తరగతి బాలిక సజీవదహనం..!
అస్సాం రాష్ట్రంలోని నాగావ్ జిల్లాలో కనీవినీ ఎరుగని ఘోరమైన ఘటన చోటు చేసుకుంది.
అస్సాం రాష్ట్రంలోని నాగావ్ జిల్లాలో కనీవినీ ఎరుగని ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. ఐదవ తరగతి చదువుతున్న ఓ బాలికపై నలుగురు మైనర్లు, ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితోనే ఆగకుండా ఆమెపై కిరోసిన్ పోసి తగులబెట్టారు. ఆ పని చేసినవారిలో కొందరు ఆమెతో పాటు చదువుకుంటున్న తోటి విద్యార్థులే కావడం గమనార్హం.
ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి.. ఒక పథకం ప్రకారం ఆమెపై అత్యాచారం చేయాలని వచ్చిన బాలురు ఇంత దారుణానికి ఒడిగట్టారు. బాలిక ఆక్రందనలు విన్న చుట్టుపక్కల ఇళ్లలోని వాళ్లు వచ్చి.. మంటలను ఆర్పి.. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి విషమించడంతో గౌహతి మెడికల్ కాలేజీ అనుబంధ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు.
అదే ఆసుపత్రిలో తనపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు బాలిక వాంగ్మూలం ఇచ్చింది. గౌహతి నగరానికి 125 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. బాలికపై అత్యాచారం చేసే ప్లాన్‌ను ఓ 21 ఏళ్ల యువకుడు రచించి.. అందుకు ఆమె స్కూల్లోనే చదువుతున్న బాలురి సహాయం తీసుకోవడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరు బాలురను అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అరెస్టు చేసిన బాలురను జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట ప్రవేశపెడతామని పోలీసులు తెలియజేశారు.