విశాఖపట్నంలో తెల్లవారుజామునే విషాదం నెలకొంది. ఓ రసాయన పరిశ్రమలో  లీకైన గ్యాస్ కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మంది వరకు ఆస్పత్రిపాలయ్యారు. అత్యంత దురదృష్టకరమైన ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఆస్పత్రిలో ఉన్న వారు త్వరగా కోలుకోవాలంటూ దేవున్ని ప్రార్థించారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే విశాఖ దుర్ఘటనపై హోం మంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ శాఖ ఉన్నతాధికారులతో ప్రధాని మాట్లాడారు. విశాఖపట్నంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశారు. అవసరమైన సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తనకు వివరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు మోదీ.



మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి వివరించారు. ఆస్పత్రుల్లో అందరు బాధితులకు వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అలాగే.. కెమికల్ ఫ్యాక్టరీకి 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు ఖాళీ చేయించినట్లు ఆయనకు వివరించారు. అవసరమైన అన్ని సహాయ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.



మరి కొద్దిసేపట్లో జాతీయ విపత్తు నిర్వహణ శాఖ ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.  ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. గ్యాస్ లీకేజీ ఘటనపై ఉన్నతాధికారులతో ఆయన చర్చించనున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..