మందిరం నిర్మించపోతే..మరో సిరియాలా భారత్
అయోధ్యలో రామమందిరం సమస్య పరిష్కారం కాకపోతే భారతదేశం సిరియాలా మారుతుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పండిట్ శ్రీశ్రీ రవిశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిరం సమస్య పరిష్కారం కాకపోతే భారతదేశం మరో సిరియాలా మారుతుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండిట్ శ్రీశ్రీ రవిశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధ్యమైనంత త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించాలని పండిట్ శ్రీశ్రీ కోరారు. అయోధ్య సమస్యకు పరిష్కారం వెదుకుతున్న ఆయన, కొన్ని రోజుల క్రితం బెంగళూరులో పలువురు హిందూ, ముస్లిం మత గురువులతో చర్చలు జరిపారు. గతవారం లక్నోలో మౌలానా నద్వితో కూడా చర్చలు జరిపారు. అయితే, కోర్టు పరిధిలో ఉన్న రామమందిరం-బాబ్రీ మసీదు వివాదానికి శ్రీశ్రీ దూరంగా ఉంటే మంచిదని పలు ముస్లిం సంఘాలు సూచించాయి.
ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన, పై విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు చేయడాన్ని ఇస్లాం అంగీకరించదని, ముస్లింలు అయోధ్యపై ఆశలు వదులుకోవాలని ఆయన సూచించారు. అది ముస్లింలు ప్రార్థనలు చేసే స్థలం కాదని అన్నారు. హిందువులు, ముస్లింల పరస్పర అంగీకారంతో రామమందిర నిర్మాణం జరగాలని, అందుకు ముస్లింలు పూర్తి మద్దతు ఇవ్వాలన్నారు. ముస్లింలకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించి, అక్కడ మసీదు నిర్మించుకోవాలని కోరారు.