లక్షన్నర ఉద్యోగాలకు కోతపెట్టనున్న భారత ఆర్మీ
లక్షన్నర ఉద్యోగాలకు కోతపెట్టనున్న భారత ఆర్మీ
భారత సైన్యం సుమారు 1.5 లక్షల ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తాజా మీడియా నివేదికలు సోమవారం వెల్లడించాయి. ఇలా ఉద్యోగాల కోత వల్ సమకూర్చబడిన నిధులను ఆధునిక ఆయుధాల కొనుగోలు కొరకు ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
కేడర్ రివ్యూలో భాగంగా వివిధ విభాగాల్లో దశలవారీగా లక్షన్నర ఉద్యోగాలను తొలగించేందుకు భారత ఆర్మీ ఓ ప్లాన్‌ను రెడీ చేస్తోంది. దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ రాబోయే రెండు సంవత్సరాల్లో 50,000 మంది సైనికుల సంఖ్యను తగ్గించడంతో పాటు ఆర్మీలోని వివిధ విభాగాలను విలీనం చేసి వాటి పనితీరు మెరుగుపర్చుకొనేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది. దీనివల్ల 2022-23లోగా పూర్తిగా లక్షన్నర ఉద్యోగాలకు గండిపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది అధ్యయన దశలో ఉందని సైనిక అధికారి ఒకరు ఓ జాతీయ పత్రికకు వెల్లడించారు.
ఉద్యోగాల కోత వల్ల సుమారు రూ.7,000 కోట్ల రూపాయల ఆదాయం ఆర్మీకి సమకూరుతాయని, ఈ నిధులు ఆయుధ సంపత్తి కొనుగోలుకు ఉపయోగపడతాయని ఎన్డీటీవీ తన నివేదికలో పేర్కొంది.
కాగా.. భారతీయ సైన్యం తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటోంది. జూన్‌లో మొత్తం 8,00,000 రైఫిల్స్ అవసరమైనప్పటికీ 2,50,000 ఆధునిక ఆయుధ రైఫిల్స్ కోసం ఆర్మీ ఆర్డర్ ఇచ్చినట్లు ఒక నివేదిక తెలిపింది.