ముంబై: ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తోన్న ఇండియన్ రైల్వే తాజాగా రైళ్లలో బుక్స్ లైబ్రరీని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అందులో భాగంగానే పైలట్ ప్రాజెక్ట్ కింద తొలుత ముంబై-అహ్మెదాబాద్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైల్లో ఇండియన్ రైల్వే ఓ బుక్ లైబ్రరీని ప్రారంభించింది. ఈ బుక్ లైబ్రరీ నుంచి ప్రయాణికులు ఎవరైనా తమ పేరు, టికెట్ వివరాలు రిజిష్టర్‌లో నమోదు చేసి, ఉచితంగా బుక్ తీసుకోవచ్చు. రైలు దిగివెళ్లిపోయే ముందు రైలులోని సహాయ సిబ్బందికి ఆ పుస్తకాన్ని తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. ఈ బుక్ లైబ్రరీలో అన్నివేళలా 30-40 రకాల పుస్తకాలు అందుబాటులో ఉండేలా ఇండియన్ రైల్వే చర్యలు తీసుకుంది. 


ఒకవేళ ఈ ప్రయోగానికి రైల్వే ప్రయాణికుల నుంచి సరైన స్పందన లభిస్తే, ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లోని మిగతా రైళ్లకు కూడా ఈ బుక్ లైబ్రరీని విస్తరించొచ్చని భారతీయ రైల్వే భావిస్తోంది.