భారతీయ రైల్వేకి షాక్: ఇంజన్ లేకుండా 10కి.మీ. ప్రయాణించిన రైలు
ప్రయాణికులతో వెళ్తున్న ఓ 22 బోగీల రైలు.. ఇంజిన్ లేకుండానే పది కిలోమీటర్లు ప్రయాణించింది.
భువనేశ్వర్: ప్రయాణికులతో వెళ్తున్న 22 బోగీల రైలు.. ఇంజిన్ లేకుండానే పది కిలోమీటర్లు ప్రయాణించింది. సమాచారం తెలుసుకున్న రైల్వే సిబ్బంది దాన్ని వెంటనే ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఒడిశాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్-పూరి ఎక్స్‌ప్రెస్ టిట్లాగఢ్ స్టేషన్ నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఈ స్టేషన్ వద్ద ఇంజిన్ అమర్చే క్రమంలో రైల్వే సిబ్బంది బ్రేకులు సరిగ్గా వేయలేదు. దీంతో ఇంజిన్ లేకుండానే బోగీలు ముందుకు వెళ్లిపోయాయి. అలా దాదాపు 10 కి.మీ దూరం ప్రయాణించాయి. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు గట్టిగా కేకలు వేశారు.
విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఆ రైలు వెంట పరుగెత్తి.. పట్టాలపై రాళ్లు అడ్డంగా పెట్టి రైలును ఆపేశారు. ఈ ఘటనలో ఆ రైలులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. ఇంజిన్‌ను జత చేసిన అనంతరం ఆ రైలు యథావిధిగా బయలుదేరింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు రైల్వే సిబ్బందిని బాధ్యులుగా చేస్తూ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.