నేడే కేంద్ర బడ్జెట్.. ఆ రెండు వర్గాలపైనే అధిక ప్రభావం ?
నేడే కేంద్ర బడ్జెట్.. ఆ రెండు వర్గాలపైనే అధిక ప్రభావం ?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ నేడు తన ఆఖరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిన అనంతరం తమ ఓటమిపై సమీక్ష నిర్వహించిన బీజేపీ.. అందుకు రైతులు, మధ్య తరగతి ఓటర్ల ఆగ్రహమే కారణమని గ్రహించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆ రెండు వర్గాల వారిని ప్రసన్నం చేసుకునేలా తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్‌ని తీర్చిదిద్దినట్టు సమాచారం. ఎన్నికలకు మరో నాలుగైదు నెలల సమయమే మిగిలివుండటంతో సాంకేతికంగా ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ.. అందులోని ఫలాలు మాత్రం దీర్ఘకాలిక ఉపశమనాలు అయ్యుండేలా ఉంటేనే మరోసారి తమ సర్కార్‌కి ప్రజామోదం లభిస్తుందనే విధంగా కేంద్రం ఈ బడ్జెట్‌ను రూపొందించినట్టు కేంద్రంలోని వివిధ శాఖల మంత్రులు వివిధ సందర్భాల్లో చేసిన ప్రకటనలు స్పష్టంచేస్తున్నాయి.
కేంద్ర బడ్జెట్ ఎవరిని ప్రసన్నం చేసుకునేలా వుంటుంది ? ఎవరికి అత్యధిక మేలు చేకూర్చేదిగా ఉంటుందనే వివరాలు తెలియాలంటే నేటి ఉదయం 11 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి పీయుష్ గోయల్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే వరకు వేచిచూడాల్సిందే మరి.