న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరానికి ఊరట లభించింది. ఆయనను సీబీఐ అరెస్ట్‌ చేయకుండా కోర్టు తాత్కాలిక రక్షణ కల్పించింది. జులై 3వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని ఢిల్లీ హైకోర్టు సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సీబీఐ విచారణకు సహకరించాలని సూచించిన కోర్టు.. చిదంబరం బెయిల్ పిటిషన్‌పై సీబీఐ స్పందనను కోరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు చిదంబరం తరఫున సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ సింఘ్వి హాజరు కాగా.. సీబీఐ తరఫున అదనపు సోలిసిటర్ జనరల్ తుషార్‌ మెహతా వాదించారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో విచారణకు హాజరయ్యేందుకు జూన్‌ 6 వరకు సమయం ఇవ్వాలని, ఆ తర్వాతే తనను విచారించాలని చిదంబరం సీబీఐని కోరారు.


కాగా ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు నేడు విచారించనున్నారు. తమ ఎదుట హాజరు కావాలని చిదంబరానికి సీబీఐ సమన్లు పంపింది. నేడు చిదంబరం సీబీఐ కేంద్ర కార్యాలయానికి విచారణ నిమిత్తం వెళ్లనున్నారు.


ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసులో జూన్‌ 5 వరకు చిదంబరాన్ని అరెస్ట్‌ చేయొద్దని ఢిల్లీ స్పెషల్ కోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే.