ఢిల్లీలో ఆడ్ ఇవెన్ స్కీమ్‌కు ప్రమాణం ఏమిటి?
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కాలుష్య నివారణ కోసం ప్రారంభించాలని భావిస్తున్న ఆడ్ ఇవెన్ స్కీమ్‌కు ఉన్న ప్రామాణికత ఏమిటో తేల్చాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ తెలిపింది. ఈ నెల 13వ తేదీ నుంచి సరి-బేసి వాహన విధానాన్ని అనుసరించాలని భావిస్తున్నట్లు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విధానంలో వాహనదారులు తమ వాహనాల నంబర్ ప్లేట్‌లపై ఉన్న చివరి సంఖ్యను బట్టి వాహనాలను రోడ్డుపైకి తీసుకురావలసి ఉంటుంది.
ఈ విధానంలో ప్రతీ రోజుకు ఒక సంఖ్యను కేటాయిస్తారు. ఈ పద్ధతిలో సరి సంఖ్య ఉన్న కార్లను బేసి సంఖ్య ఉన్న తేదీ రోజున రోడ్లపైకి తీసుకురావడానికి అనుమతిస్తారు, అలాగే బేసి సంఖ్య ఉన్న కార్లను సరి సంఖ్య తేదీ ఉన్న రోజున మాత్రమే రోడ్లపైకి అనుమతించడం జరుగుతుంది. అయితే ఈ విధానాన్ని ఏ హేతుబద్ధతను బట్టి అనుసరించాలని భావిస్తున్నారో తెలపాలని.. ఈ విధానం వల్ల గతంలో కాలుష్య నివారణ జరిగిన ఉదంతాలు ఉన్నాయో లేవో కూడా తెలపాలని ట్రిబ్యూనల్ ప్రశ్నించింది.
ప్రస్తుతం నగరంలో పెచ్చుమీరుతున్న కాలుష్య నివారణ దృష్ట్యా కొత్త కట్టడాలకు అనుమతిని ఆపివేయాలని.. అలాగే 10 సంవత్సరాల సర్వీసు దాటిన కార్లను ఢిల్లీలోకి అనుమతించవద్దని ట్రిబ్యూనల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఢిల్లీలోని పరిస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన బాధ్యతను తీసుకోవాలని చెప్పింది. గతంలో ఇలాంటి పరిస్థితులే ఎదురైనప్పుడు... హెలీకాప్టర్ల ద్వారా కృత్రిమ వర్షాలను కురిపించిన దాఖలాలు ఉన్నాయని.. అలాంటి పద్ధతులకు ప్రభుత్వం ఎందుకు నాంది పలకలేదని.. గాలిలో స్వచ్ఛత శాతం తగ్గి ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ట్రిబ్యూనల్ అభిప్రాయబడింది.