భారత్‌లో ప్రస్తుతం చలామణిలో లేని పాత రూ.1000, రూ.500 నోట్లను పాకిస్తాన్‌కి చెందిన ఐఎస్ఐకి అనుబంధంగా పనిచేస్తోన్న డీ-కంపెనీ కొనుగోలు చేసి పాకిస్తాన్‌కి తరలిస్తున్నట్టు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. రద్దయిన పాత నోట్లలో ఒరిజినాలిటీని సూచించే మెరుపు తీగను తొలగించి, వాటిని ప్రస్తుతం భారత్‌లో చలామణిలో ఉన్న రూ.2,000 రూ.500 రూ.50 నోట్లను పోలి ఉన్న నకిలీ నోట్ల తయారీలో ఉపయోగిస్తున్నట్టు భారత నిఘా వర్గాల పరిశీలినలో తేలింది. భారత నిఘా వర్గాలు వెల్లడించిన సమచారం ప్రకారం.. భారత్‌లో పాత రూ.1000, రూ.500 నోట్లను కొనుగోలు చేస్తోన్న డీ-కంపెనీ, ఆ నోట్లను మొదట నేపాల్ తరలించి, అక్కడి నుంచి పాకిస్తాన్‌లోని కరాచి, పెషావర్‌లలోని కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లకి స్మగ్లింగ్ చేస్తోంది. అక్కడి కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లలో రూ.1000, రూ.500 నోట్లలోని మెరుపు తీగను తొలగించి, అదే తీగను కొత్త రూ.2000 రూ.500 రూ.50 నకిలీ నోట్ల తయారీలో ఉపయోగించి తిరిగి ఆ నకిలీ నోట్లను పాకిస్తాన్ దేశం సరిహద్దులు దాటించేందుకు ఐఎస్ఐ సహకరిస్తోంది. 


భారత్‌లో పెద్ద మొత్తంలో తరచుగా బయటపడుతున్న పాత పెద్ద నోట్ల సేకరణ, అమ్మకాల వెనుక ఏం జరుగుతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ నిజం వెలుగుచూసినట్టు భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అలా ఇప్పటివరకు ఎంతమేరకు రద్దయిన పాత నోట్లు పాకిస్తాన్‌కి స్మగ్లింగ్ అయ్యాయనే లెక్కలు తేల్చే పనిపై ఐఎస్ఐ దృష్టిసారించింది.