పీఎస్ఎల్వీ-సీ40 ప్రయోగం సక్సెస్.. సెంచరీ కొట్టిన ఇస్రో!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో విజయం సొంతం చేసుకుంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో విజయం సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ రిసెర్చ్ సెంటర్ నుంచి ఇవాళ ఉదయం ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ40 ప్రయోగం విజయవంతమైంది. నేటి ఉదయం 9:28 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగికెగిసిన పీఎస్ఎల్వీ-సీ40 మోసుకెళ్లిన 30 శాటిలైట్లను నిర్ణీత సమయంలో నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టడంతో ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదైంది. 2018లో ఇస్రో చేపట్టిన ఈ తొలి ప్రయోగం ఇస్రో ఖాతాలో 100వ ప్రయోగం కావడం మరో విశేషం. దీంతో ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ40 ప్రయోగం ఇస్రోను చరిత్ర పుటల్లో ఎక్కించడమేకాకుండా భారత అంతరిక్ష పరిశోధన రంగానికి గర్వ కారణంగానూ నిలిచింది.
గత సెప్టెంబర్‌లో ఐఆర్ఎన్ఎస్ఎస్-1హెచ్ శాటిలైట్ ప్రయోగం విఫలమైన తర్వాత మళ్లీ ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం కూడా ఇదే. ఇస్రో సాధించిన ఈ విజయం పాత వైఫల్యాన్ని తుడిచిపెట్టేలా చేసింది. ఇస్రోకి చెందిన వాణిజ్య సంస్థ యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో పలు విదేశీ అంతరిక్ష సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పీఎస్ఎల్వీ -సీ40 తీసుకెళ్లిన ఉపగ్రహాల్లో 28 విదేశీ శాటిలైట్లు ఉన్నాయి. కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, కొరియా, యూకే, అమెరికా లాంటి అగ్రదేశాలకు చెందిన ఉపగ్రహాలు ఈ జాబితాలో వుండటం మరో విశేషం.
పీఎస్ఎల్వీ-సీ40 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. భారతీయులకు ఇది న్యూ ఇయర్ గిఫ్టుగా అంకితం ఇస్తున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించగా ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి దేశాధినేతలు ఇస్రోని అభినందించారు.