ఆమె అరుణాచల్‌కు వస్తే.. చైనాకి నచ్చదట
ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ శనివారం, ఆదివారాల్లో కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధికారిక పర్యటన చేయనున్నారు. ఈ క్రమంలో ఆ పర్యటనపై చైనా నుండి వస్తున్న అభ్యంతరాలను ఆమె ఖండించారు. వివాదాస్పదమైన ఆ చోటును నిర్మలా సీతారామన్ పర్యటించడాన్ని తప్పు పట్టిన చైనాకు ఆమె కౌంటర్ ఇచ్చారు. "అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం. ఈ రాష్ట్రాన్ని భారతీయులెవరైనా పర్యటించవచ్చు. నేను కూడా పర్యటిస్తాను. అలాంటప్పుడు చైనా సమస్యేమిటో నాకు అర్థం కావడం లేదు" అని ఆమె తెలిపారు. "ఒకరి అభిప్రాయాలతో మాకు పనిలేదు" అని కూడా ఆమె తెలియజేశారు. అరుణాచల్ ప్రదేశ్, చైనా బోర్డర్‌కి దగ్గరలో ఉన్న అంజావ్ జిల్లాలో రక్షణ శాఖ మంత్రి పర్యటించారు. అక్కడ కాపు గాస్తున్న భారతీయ సైనికులతో మాట్లాడారు. గత నెలలో ఆమె సిక్కిం, చైనా సరిహద్దు ప్రాంతమైన నాతులా ప్రాంతాన్ని సందర్శించి, సరిహద్దు వద్ద గస్తీ కాస్తున్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులను పలకరించిన సంగతి తెలిసిందే. చైనా సైనికులను ఆమె స్నేహపూర్వకంగా పలకరించిన తీరుపై చైనా మీడియా కూడా పాజిటవ్‌గానే స్పందించింది. ఆమెను పొగడ్తలతో ముంచెత్తింది.