మోదీజీ ప్రధాని అని మరిచిపోయారు: రాహుల్
ప్రధానమంత్రి లోక్‌సభలో ఉద్యోగ అవకాశాలు, రైతుల అవసరాలను, రాఫెల్ ఒప్పందాలపై ఎందుకు మాట్లాడలేదని రాహుల్ ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్‌సభలో రాష్ట్రపతి ఉపన్యాసంపై ధన్యవాదాలు తెలిపారు. ప్రసంగం ముగిశాక కొద్ది నిమిషాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి బుధవారం ప్రశ్న సంధించారు.
మోదీ ప్రసంగం తరువాత బయటకు వచ్చిన రాహుల్, మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఉద్యోగ అవకాశాలు, రైతుల అవసరాలను, రాఫెల్ ఒప్పందాలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 'ప్రధాని మోదీ సుమారు గంటసేపు మాట్లాడారు. కానీ, రాఫెల్ ఒప్పందం గురించి ఏమీ మాట్లాడలేదు' అని రాహుల్ గాంధీ అన్నారు.
'మోదీగారు ఇప్పుడు ప్రధాని అని మరిచిపోయారు. ఆయన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అంతేగానీ ఎల్లప్పుడూ ప్రతిపక్షాన్ని నిందిస్తూ ఉండరాదు' అని రాహుల్ చెప్పారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రసంగం అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతకుముందు, ప్రధానమంత్రి కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ దేశ విభజనకు కారణమైందని, ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిందని అన్నారు. "ఆప్నే దేశ్ కే టుక్డే కియే (మీరు ఈ దేశాన్ని విభజించారు). ఇది మీ నైజం" అని ప్రధాని తెలిపారు.