నారాయణ్‌పూర్‌: ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్(ITBP) బలగాలకు చెందిన ఓ జవాను ఆరుగురు తోటి జవాన్లను కాల్చిచంపడంతోపాటు మరో ముగ్గురుని కాల్పులతో గాయపరిచిన ఘటన చత్తీస్‌ఘడ్‌లోని నారాయణ్‌పూర్‌లో బుధవారం ఉదయం 8.30 గంటలకు చోటుచేసుకుంది. 45వ బెటాలియన్‌ విధులు నిర్వర్తిస్తున్న కడేనార్ క్యాంప్‌ వద్ద ఈ ఘటన జరిగింది. క్యాంపులో విధులు నిర్వర్తించే సమయంలో జవాన్ల బృందంలో చోటుచేసుకున్న స్వల్ప వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో భాగంగానే కోపోద్రిక్తుడైన ఓ జవాన్ తన తోటి జవాన్లపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలోనే ఆరుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా రాయ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించగా.. వారిలోనూ చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు. 


జవాన్లపై కాల్పులు జరిపిన అనంతరం నిందితుడిని ఇతర జవాన్లు కాల్చిచంపినట్టు బస్తర్ రేంజ్ ఐజి సుందర్ రాజ్ తెలిపారు. దాడికి పాల్పడిన నిందితుడిని ఐటిబిసి కానిస్టేబుల్ మసుదుల్ రహ్మాన్‌గా అధికారులు గుర్తించారు.  దాడికి గల కారణాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదు.