ఇవాంక డోనాల్డ్ ట్రంప్ కూతురు కాదు..మహిళా ప్రతినిధి
హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో ఇవాంక ట్రంప్ ఆకట్టుకునే రీతిలో ప్రసంగించారు.
హైదరాబాద్: ప్రపంచ వేదికపై ఆకట్టుకునే రీతిలో ప్రసంగించారు ఇవాంక ట్రంప్. అద్భుత స్పీచ్‌తో ఇవాంకలో ఉన్న అసలు కోణం బయటపడింది. సదస్సు ముందు వరకు ఆమె అమెరికా అధ్యక్షుడి కుమార్తెగా పరిచయం.... సదస్సులో మహిళా సాధికారతపై ఆమె మాట్లాడిన తర్వాత నారీ ప్రపంచానికి ప్రతినిధి మారారు. మహిళా సమస్యలనే ప్రధానాంశంగా తీసుకొని వారి సాధికారతపై అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ప్రపంచ వేదికపై ఆకట్టుకున్న ఇవాంక
ప్రపంచస్థాయి వేదికపై ప్రసంగించిన ఇవాంక.. మాటల్లో ఎక్కడా తడబాటు లేదు.. భావాల్లో ఎక్కడా అస్పష్టతకానీ కనిపించలేదు. మహిళా సాధికారతపై ఆమెకు స్పష్టమైన విజన్ కనిపించింది. ప్రపంచ వేదికపై ఆమె ఎంతో పరిణితి చెందిన వక్తలా మాట్లాడి అందరినోటా ఔరా అనిపించింది. ఆమె మాట్లాడింది ఆంగ్లమే అయినా.. భాష తెలియని వారు కూడా ఆమె ఏం చెబుతుందోనని శ్రద్ధగా కళ్లార్పకుండా ఇట్టే ఆలకించారు. మహిళా సాధికారికతపై అనర్గళంగా మాట్లాడిన ఇవాంక.. మహిళలు పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. ఆమె స్పీచ్ విన్న వారు శహబాష్ అనకుండా ఉండలేకపోయారు. మొత్తంగా చూస్తే ఆమె మహిళా ప్రపంచానికి ప్రతినిధిగా వ్యవహరించారే కానీ ట్రంప్ కూతురుగా కాదు.