అమెరికా సలహాదారు ఇవాంకా ట్రంప్ రాకను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నరు నరసింహన్ ఇవాంకాకు సాదర స్వాగతం పలికి కరచాలనం చేశారు. ఆ తర్వాత ప్రధాని మోడీతో కలిసి ప్రపంచ పారిశ్రామిక సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజెంటేషన్ తిలకించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారతీయ కళాకృతుల స్టాల్ వద్ద ఆగిన ఇవాంకా వాటిని చూసి ముగ్ధురాలయ్యారు. కొన్ని కళాకృతులను తనతో పాటు తీసుకెళ్లారు. ఆ కళాకృతులను తయారు చేసిన వ్యక్తిని అభినందించారు. తనతో కలిసి ఫోటో దిగారు. 


"మహిళలే ప్రథమం- అందరికీ శ్రేయస్సు" అనే నినాదంతో ఈ సదస్సు ప్రారంభమవనుంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకాతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ఇప్పటికే హెచ్‌ఐసీసీ వద్దకు ప్రతినిధులు చేరుకున్నారు. భారీ బందోబస్తు నడుమ ఈ సదస్సుకు హాజరయ్యే ఇవాంకా ప్రధాని ఫలక్‌నామాలో అందించే ప్రత్యేక విందుకు కూడా హాజరు కానున్నారు.