ఇవాళ (అక్టోబర్ 8, 2018) జమ్మూకాశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. తొలివిడతలో 1,145 వార్డులకు గాను 422 వార్డులకు కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. ఎన్నికల దృష్ట్యా దక్షిణ కాశ్మీర్‌లో ఇంటర్‌‌నెట్‌ సేవలు నిలిపివేశారు. జమ్ములోయలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ స్పీడ్‌ని 2జీకి తగ్గించారని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికల కమిషన్ ప్రకారం, మొత్తం 422 మున్సిపల్ వార్డులకు 1283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీకి దిగారు. అటు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో.. ఎన్నికల కమిషన్ తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) ప్రవేశపెట్టింది.  తొలిసారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా కాశ్మీరీ వలసదారులకూ ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం.


ఇవాళ జరుగుతున్న ఎన్నికలకు.. అక్టోబరు 20న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.


రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ బీవీఆర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. పోలింగ్ విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక నెల అదనపు జీతం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.


కాగా ఇవాళ జమ్మూ కాశ్మీర్‌లో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)లు బహిష్కరించాయి.