ముంబై నుంచి జైపూర్ బయల్దేరిన జెట్ ఎయిర్ వేస్ విమానం గాల్లోకి టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే తిరిగి ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. అందుకు కారణం విమానం టేకాఫ్ సమయంలో కొంత మంది ప్రయాణికులకు భరించలేని చెవి నొప్పితోపాటు ముక్కుల్లోంచి రక్తం కారడమే. అనుకోని పరిణామానికి షాకైన ప్రయాణికులు అరుపులు, కేకలు మొదలుపెట్టారు. దీంతో ప్రయాణికులకు అత్యవసర చికిత్స నిమిత్తం విమానం సిబ్బంది విమానాన్ని తిరిగి ముంబై ఎయిర్ పోర్టులో దించేశారు. అంతకన్నా ముందుగా ప్రయాణికులకు ఆక్సీజన్ మాస్కులు అందించి వారికి కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారు. గురువారం ఉదయం ముంబైలో జరిగిన ఈ ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ముంబైలో విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులంతా క్షేమంగా కిందకు దిగారు.



ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పౌర విమానయాన శాఖ, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి పూర్తి నివేదిక అందించాల్సిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియోషన్‌ (డీజీసీఏ)కి ఆదేశాలు జారీచేసింది. జరిగిన ఘటనపై డీజీసీఏ సైతం తీవ్రంగా స్పందించింది. విమానం సిబ్బందిని తొలగించినట్టుగా స్పష్టంచేసిన డీజీసీఏ, ఇప్పటికే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఏవియేషన్ బ్యూరో దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొంది.