న్యూఢిల్లీ: అయోధ్యలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్‌కి చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ (JeM terrorists) కుట్రపన్నుతున్నట్టు భారత నిఘావర్గాలు పసిగట్టాయి. జీ హిందుస్తాన్‌కి అందిన సమాచారం ప్రకారం.. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజార్ (Maulana Masood Azhar) భారత్‌లో ఉన్న తమ ఉగ్రవాదులకు టెలిగ్రామ్ చాటింగ్ యాప్‌ (Telegram app)లో పంపించిన సందేశాన్ని దానిని భారత నిఘావర్గాలు గుర్తించినట్టు తెలుస్తోంది. మౌలానా మసూద్ అజార్ పంపించిన ఆ సందేశాన్ని డీకోడ్ చేసిన ఇంటెలీజెన్స్ ఏజెన్సీలకు.. సదరు నిషేధిత ఉగ్రవాద సంస్థ అయోధ్యలో ఉగ్రదాడులకు (Terror attacks) పాల్పడేందుకు కుట్రపన్నుతున్నట్టు గ్రహించారు. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖతోపాటు అన్ని భద్రతా బలగాల విభాగాలకు తెలియజేసిన నిఘావర్గాలు.. అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరించాయి. నిఘావర్గాల హెచ్చరికలతో భారత్‌లోని జైషే మహమ్మద్ నెట్‌వర్క్‌పై ఓ కన్నేసిన భద్రతా బలగాలు.. అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. అయోధ్యలో రద్దీగా ఉండే అన్ని ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దశాబ్ధాల తరబడిగా అపరిష్కృతంగా ఉన్న అయోధ్య వివాదంలో (Ayodhya land dispute) ఇటీవలే సుప్రీం కోర్టు సంచలన తీర్పు (Supreme court verdict) వెలువరించిన సంగతి తెలిసిందే. వివాదంలో ఉన్న అయోధ్య స్థలంలో రామ మందిరం నిర్మించాలని స్పష్టంచేసిన సుప్రీం కోర్టు.. అదే సమయంలో మరో ఐదు ఎకరాల భూమిని ముస్లిం సంస్థకు కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై పలు ముస్లిం మత సంస్థల పెద్దలు.. అభ్యంతరాలు వ్యక్తంచేయడం పతాకశీర్షికలకెక్కింది. ఈ నేపథ్యంలోనే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సైతం అయోధ్య తీర్పునకు నిరసనగా అయోధ్యలో ఉగ్రదాడికి పాల్పడే ప్రమాదం ఉందని నిఘావర్గాలు భావిస్తున్నాయి.


జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ భారత్‌లో దాడులకు పాల్పడటం ఇదేం కొత్త కాదు. 2001లో భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడికి పాల్పడం నుంచి మొదలుపెడితే.. ఇదే ఏడాది ఫిబ్రవరిలో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై (Pulwama terror attack) ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మంది సైనికులను పొట్టనపెట్టుకోవడం వరకు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఎన్నో అరాచకాలకు పాల్పడింది. పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్టుగా మే 1న యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్ ఓ ప్రకటన విడుదల చేసింది.