జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ తీవ్రవాదిని భద్రతాదళాలు మట్టుబెట్టాయి. సఫకాదాల్‌లోని తబేలా ఛట్టాబల్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి కాల్పులు జరుపుతున్నారని, అలాగే ఎన్‌కౌంటర్ కూడా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇదే ఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) అధికారి గాయపడ్డారని, చికిత్స కోసం అతడిని సమీప ఆసుపత్రికి తరలించారని వెల్లడించారు.


'ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతోంది. ప్రతీకారంతో ఉన్న తీవ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. ప్రతిగా భారతదళం కూడా కాల్పులు జరిపింది' అని ఓ అధికారి తెలిపారు. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని ఓ అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అటు బందీపోరా జిల్లాలో లష్కర్-ఈ- తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు ఇద్దరు పౌరులను అపహరించి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.