జయ కుమార్తె `అమృత` ఆసక్తికర వ్యాఖ్యలు
జయలలిత కుమార్తెనంటూ సంచలనం సృష్టించిన `అమృత` తన మనసులో మాటను ఇలా బయపెట్టింది.
దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలిత కుమార్తె అని 'అమృత' తెరపైకి వచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. డీఎన్ఏ సహా ఎలాంటి టెస్టులకైన సిద్ధమని ప్రకటించి కొన్ని రోజుల నుంచి వార్తల్లో నిలిచారు ఆమె. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ ఆమెతో ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఈ సమయంలో అమృత పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను జయకుమార్తె అనే విషయం 2017 వరకు తనకు తెలియదని.. తన పెంపుడు తండ్రి సారథి 2017 మార్చిలో చనిపోయే సమయంలో తాను జయలలిత కుమార్తెనని చెప్పడంతో షాక్ కు గురయ్యానని..దాన్ని వెంటనే నిర్ధారించుకోలేకపోయానని వెల్లడిండింది. తన పెంపుడు తల్లి లలిత 2015లో మరణించగా... అప్పటివరకు ఆమె కుమార్తెనేనని భావించానని తెలిపారు. తర్వాత తన బంధువులను విచారించగా జయలలితకు కుమార్తె ఉన్న విషయం నిజమేనని.. అది తానేనని చెప్పడంతో ప్రస్తుతం దానిని బహిర్గతం చేశానని పేర్కొన్నారు.
తొలిసారిగా అప్పుడే చూశా..
1996 జూన్ 6న తన తల్లి జయలలితను తాను తొలిసారిగా చూశానని 'అమృత' పేర్కొన్నారు. అధికారం కోల్పోయిన మానసిక ఒత్తిడిలో ఆమె... తనను చూసిన వెంటనే ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకున్నారని..అది తనకు దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమెను పలుమార్లు కలిశానని తెలిపారు. ఒకే పళ్లెంలో తిన్నామని.. ఒకే పడకపై నిద్రించామని వివరించారు. జయలలితను చూసేందుకు తాను సచివాలయానికి వెళ్లిన ప్రతిసారి ‘నువ్వు ఎక్కడైనా ఉండు. ప్రాణాలతో ఉంటే చాలు’ అనేవారని పేర్కొన్నారు.
ఆమె ఆస్పత్రిలో చేరడానికి ముందుగా ఫోన్ చేసి చూడటానికి వస్తున్నట్టు చెబితే వద్దని వారించారని వివరించారు. ఇంట్లో ఉండబోనని తెలిపారని పేర్కొన్నారు. అయినా తాను పోయెస్‌గార్డెన్‌లోని వేదనిలయానికి వెళ్లగా ఆమె లేరని చెప్పారని..తర్వాత విచారించగా ఆమెకు ఇంట్లోనే వైద్యచికిత్సలు అందిస్తున్నట్టు తెలిసిందని వివరించారు.
జయలలితను పలుమార్లు కలిసినందున దానికి ఆధారంగా సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలు ఉండొచ్చని అమృత తెలిపారు. జెడ్ కేటగిరీ రిజిస్ట్రర్‌లోనూ ఈ వివరాలు ఉంటాయని చెప్పారు. జయలలిత సోదరినని.. డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధమంటూ తన పెంపుడు తల్లి లలిత గతంలో తెరపైకి వచ్చారని.. అలాగే తాను కూడా డీఎన్‌ఏ పరీక్ష ద్వారా జయలలిత కుమార్తెనని నిరూపించాల్సి ఉన్నట్టు భావిస్తున్నానని పేర్కొన్నారు. జయలలిత మరణించడానికి ముందుగా స్పృహలో ఉంటే కచ్చితంగా తనతో మాట్లాడి ఉండేవారని తెలిపారు.
జయను కలవకుండా శశికళ కుట్ర..
తన తల్లి జయను కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ తనను కలవనీయకుండా శశికళ కుటుంబ సభ్యులు తనను అడ్డుకున్నారని చెప్తూ 'అమృత' ఆవేదన వ్యక్తం చేశారు. బహుశ జయ ఆస్తిపాస్తులపై వాళ్లు కన్నేసి ఉంటారని అందుకే ఇలా చేసి ఉంటారని ఆమె ఆరోపించారు. ఏది ఏమైన తల్లి ఆస్తిపాస్తుల కంటే తనను జయలలిత కుమార్తెగా గుర్తిస్తే చాలని ఈ సందర్భంగా 'అమృత' ఇలా జరిగిన ఘటనలను యథాతథంగా వెల్లడించారు.