తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో భాగంగానే మరోమారు ఆర్ముగస్వామి కమిషన్ ఎదుట హాజరైన మద్రాస్ మెడికల్ కాలేజీ (ఎంఎంసీ) అనాటమీ విభాగం చీఫ్ డాక్టర్ సుధా శేషయ్యన్.. జయలలిత ఎడమ దవడపై రంధ్రాలు చేయడం వెనుకున్న కారణాలని కమిటీకి వివరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జయలలిత మృతిచెందిన రోజు రాత్రి పది గంటలకు తనకి ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. ఆమె ప్రజా నాయకురాలు కనుక ప్రజలు, ప్రజాప్రతినిధుల సందర్శనార్ధం మృతదేహాన్ని చెడిపోకుండా, దుర్వాసన రాకుండా ఎంబ్లామింగ్ చేయడానికి తనని ఆస్పత్రికి రావాల్సిందిగా ఫోన్‌లో చెప్పారు. మద్రాస్ మెడికల్ కాలేజీ అనాటమి బృందంతో కలిసి మృతదేహంలోకి రసాయనాలు ఎక్కించేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగానే జయలలిత మృతదేహం ఎడమ దవడపై నాలుగు రంధ్రాలు చేసినట్టు ఆమెకి కమిటీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మృతదేహం నుంచి దుర్వాసన రాకుండా మెథనాల్ సహా వివిధ రసాయనాలు కలిగిన ఐదున్నర లీటర్ల మిశ్రమాన్ని జయలలిత మృతదేహంలోకి ఇంజెక్ట్ చేసినట్టు డా. సుధా శేషయ్యన్ తెలిపారు. 


2016లో డిసెంబర్ 5న అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో జయలలిత  మృతిచెందిన తర్వాత గతేడాది ఫిబ్రవరిలోనూ ఈ వివాదంపై స్పందించిన డా సుధా శేషయ్యన్ అప్పుడు కూడా జయలలిత మృతదేహంపై రంద్రాలు వుండటానికి గల కారణాలని మీడియాకు వెల్లడించారు.