ముంబై నుంచి ఇవాళ ఉదయం జైపూర్ బయల్దేరిన జెట్ ఎయిర్‌వేస్ విమానం గాల్లోకి టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే అత్యవసర పరిస్థితుల్లో తిరిగి ముంబై ఎయిర్ పోర్టులో దిగిన సంగతి తెలిసిందే. విమానం టేకాఫ్ సమయంలో కొంత మంది ప్రయాణికులకు భరించలేని చెవి నొప్పితోపాటు ముక్కుల్లోంచి రక్తం కారడంతో ప్రయాణికులకు అత్యవసర చికిత్స నిమిత్తం విమానం సిబ్బంది విమానాన్ని తిరిగి ముంబై ఎయిర్ పోర్టులో దించేశారు. అంతకన్నా ముందుగా ప్రయాణికులకు ఆక్సీజన్ మాస్కులు అందించి వారికి కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారు. గురువారం ఉదయం ముంబైలో జరిగిన ఈ ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ముంబైలో విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులంతా క్షేమంగా కిందకు దిగారు. 


తాజాగా ఈ ఘటనపై స్పందించిన జెట్ ఎయిర్ వేస్ ఎయిర్ లైన్స్ సంస్థ.. ఆస్పత్రికి పంపించిన ఐదుగురు అతిథులు(ప్రయాణికులు) సురక్షితంగా ఉన్నట్టు స్పష్టంచేసింది. డీజీసీఏ జరుపుతున్న విచారణకు తాము కూడా సహకరిస్తున్నామని ఈ సందర్భంగా జెట్ ఎయిర్‌వేస్ తేల్చిచెప్పింది.