సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌పై జార్ఖండ్‌లో ఏబీవీపీ, బీజేవైఎం, బీజేపీ కార్యకర్తలు మంగళవారం దాడిచేశారు. పకూర్‌ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అగ్నివేశ్‌పై దాడి చేసిన కార్యకర్తలు ఆయనను కొట్టడంతో పాటు దుస్తులు చించివేశారు. ఆయన బస చేసే హోటల్‌ వద్ద వేచి ఉన్న బీజేపీ కార్యకర్తలు ఆయన బయటకు రాగానే మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. దీంతో అగ్నివేశ్‌ను స‌మీపంలోని ఆస్పత్రికి త‌ర‌లించారు. త‌న‌పై జ‌రిగిన దాడిని అగ్నివేశ్‌ ఖండించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీఫ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయని, ఆయన క్రిస్టియన్‌ మిషనరీలతో కలిసి జార్ఖండ్‌లో గిరిజనులను వేధిస్తున్నారని కార్యకర్తలు మండిపడ్డారు.


అయితే, బీజేపీ జార్ఖండ్ విభాగం ఈ చర్యను ఖండించింది. ఈ సంఘటనలో పాల్గొన్నవారు తమ పార్టీ కార్యకర్తలు కాదని తెలిపింది.


కాగా, ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ వెల్లడించారు. దాడులకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.


రాజకీయాల నుంచి తప్పుకొనే ముందు అగ్నివేశ్ 1970లలో హర్యానా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అన్నా హజారే యొక్క అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కూడా సభ్యుడిగా ఉన్నారు.